చదువు భారమై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ లో ఓ ఇంటర్ విద్యార్థి బంధువుల ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన సాగంటి సంతోష్ (16) అనే ఇంటర్ విద్యార్థి 2023 ఆగస్టు 03 గురువారం ఇంట్లో నుండి తన మేనత్త ఇంటికి వచ్చాడు. కన్నాపూర్ గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు.

సంతోష్ మొదటి నుండి చదువులో ఆసక్తి చూపకుండా ఉండేవాడని బంధువులు తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన తర్వాత కరీంనగర్ పట్టణంలో ఓ కళాశాలలో అతని తల్లిదండ్రులు జాయిన్ చేశారు. అయితే సంతోష్ సరిగా చదవడం లేదని ఉపాధ్యాయులు చెప్పడంతో.. తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం కరీంనగర్ కళాశాల నుండి టీసీ తీసుకువచ్చి, మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో చదివిస్తామని చెప్పడంతో సంతోష్ మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా మేనత్త ఇంటికి వచ్చి సంతోష్ ఉరేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.