డాడీ.. నీ పేరు నిలబెట్టలేనేమోనని భయమేస్తోంది..!

డాడీ.. నీ పేరు నిలబెట్టలేనేమోనని భయమేస్తోంది..!
  •     భయమేస్తోందంటూ ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ 

ఎల్బీనగర్/ అచ్చంపేట, వెలుగు:  ‘‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. ఐయామ్​సారీ.. నా వరకు ట్రై చేస్తున్నా. కానీ, నీ పేరు నిలబెట్టలేనేమోనని భయమేస్తోంది” అంటూ ఇంటర్ మెరిట్ స్టూడెంట్ లెటర్ రాసి సూసైడ్ అటెంప్ట్ చేయడం సిటీలో కలకలం రేపింది. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురుబావికి చెందిన రమావత్​హరీశ్, అనూష దంపతులు. వీరి కూతురు రేణుశ్రీ హైదరాబాద్ కొత్తపేట సమీపంలోని శ్రీచైతన్య కాలేజీలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. ఇంటర్ ఫస్టియర్​లో రేణుశ్రీకి 440 మార్కులకు గాను 432 మార్కులు వచ్చాయి. 

అయితే, శనివారం రాత్రి ఉన్నట్టుండి హస్టల్​లో ఫ్యాన్​కు​ఉరేసుకొని సూసైడ్​అటెంప్ట్ చేసింది. వెంటనే కాలేజీ యాజమాన్యం రేణుశ్రీని కొత్తపేటలో ఓమిని హాస్పిటల్​కు తరలించి, అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి సూసైడ్​ నోట్ స్వాధీనం చేసుకున్న చైతన్యపురి పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.  మరోవైపు, గిరిజన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని  కొత్తపేట చౌరస్తాలో గిరిజన సంఘం, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. యజమాన్యం ఒత్తిడి చేయడంతోనే రేణుశ్రీ ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు.