ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్  బాచుపల్లిలో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ ​విద్యార్థిని మృతి చెందింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మేళ్లచెరువు కిష్టపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, దేవి దంపతులు ఉపాధి కోసం సిటీకి వచ్చి బోరబండలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.  చిన్నకూతురు పూజిత బాచుపల్లిలోని ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్​ సెకండియర్ చదువుతోంది. 

బుధవారం ఉదయం కాలేజీ మేనేజ్ మెంట్  పూజిత తల్లిదండ్రులకు ఫోన్​ చేసి బాత్​రూమ్ లో జారిపడిపోయిందని చెప్పారు. కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందన్నారు. తల్లిదండ్రులు వచ్చేసరికే విద్యార్థిని డెడ్ బాడీని  గాంధీ దవాఖానకు తరలించారు. దీంతో కాలేజీ యాజమాన్యంపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమకు, పోలీసులకు సమాచారం లేకుండా మృతదేహాన్ని ఎలా తరలిస్తారని నిలదీశారు. ఈ క్రమంలో కాలేజీ నిర్వాహకులు, పూజిత బంధువులకు మధ్య తోపులాట జరిగింది. తమ బిడ్డ మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. బాచుపల్లి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.