- హాస్టల్ గదిలో ఒకరు.. బాత్రూమ్లో మరొకరు
- బాచుపల్లి, పోచారంలో ఘటనలు
జీడిమెట్ల, వెలుగు: సిటీలో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉరేసుకొని మృతి చెందారు. నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రఘునాథ్‌రెడ్డి కూతురు ప్రజ్ఞారెడ్డి (16).. బాచుపల్లి పీఎస్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్‌లో ఎంపీసీ సెకండియర్చదువుతోంది.
సోమవారం ఉదయం 9 గంటలకు హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది. దీంతో ప్రజ్ఞారెడ్డి మృతిపై బాధిత కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాలేజీ వద్ద ఆందోళన చేసి, అద్దాలను ధ్వంసం చేశారు. యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘట్కేసర్: సిటీ శివారులోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోనూ మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పెద్దపలుగు తండాకు చెందిన బానోతు జగన్నాథ్ కుటుంబంతో కలిసి కుషాయిగూడలో నివాసం ఉంటున్నాడు. ఆయన కొడుకు బానోతు తనుశ్నాయక్ అలియాస్ టింకు (16) అన్నోజిగూడలోని ఓ కార్పొరేట్కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం క్యాంపస్ బాత్ రూమ్‌లోకి వెళ్లి, ఎంతసేపటికి తిరిగిరాలేదు.
తోటి విద్యార్థులకు అనుమానం వచ్చి చూడగా, ఉరేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న యాజమాన్యం హుటాహుటిన విద్యార్థిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడని తెలియడంతో విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కొడుకు చనిపోయాడని బాధిత తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.
తమకు చెప్పకుండా డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, ఘటన జరిగిన కాలేజీలోని విద్యార్థులను యాజమాన్యం వారి ఇండ్లకు పంపుతోంది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లల్ని ఇంటికి తీసుకుపోవాల్సిందిగా కోరింది. దీంతో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దాదాపు 345 మందిని వారి పేరెంట్స్ ఇండ్లకు తీసుకెళ్లారు.