- పీఆర్సీ కమిటీకి ఇంటర్ విద్యా జేఏసీ వినతి
హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ చేయాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి కోరారు. ఉద్యోగులందరికీ 50% ఫిట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్కే భవన్లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేతలు, ఇంటర్ విద్యాజేఏసీ నేతలు రెండో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ ను కలిశారు. ఈ సందర్భంగా సర్కారు జూనియర్ లెక్చరర్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉన్నతాధికారుల వేతన సవరణకు సంబంధించిన సమగ్ర నివేదికను పీఆర్సీ కమిటీకి అందించారు.
మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 15% హెచ్ఆర్ఏ, మున్సిపాలిటీల్లో 18%, జిల్లా హెడ్ క్వార్టర్లలో పనిచేసే వారికి 20%, జీహెచ్ఎంసీ పరిధిలోని వారికి 27% హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరారు. ఇంటర్ ఎడ్యుకేషన్ లో పనిచేసే జూనియర్ లెక్చరర్ల పేరును.. లెక్చరర్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులను సెంట్రల్ గవర్నమెంట్ మాదిరిగా 90 రోజుల నుంచి 730 రోజులకు పెంచాలని రిక్వెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాజేఏసీ నేతలు కృష్ణకుమార్, కేఎస్ రామారావు, రవీందర్ రెడ్డి, రామానుజాచార్యులు పాల్గొన్నారు.