హైదరాబాద్, వెలుగు: చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌మరో ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు వేదికైంది. ప్రతిష్టాత్మక ఫిఫా ఇంటర్‌కాంటినెంటల్ కప్‌ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో మారిషస్‌తో ఇండియా తలపడనుంది. ఈ నెల 9 వరకు జరిగే ఈ టోర్నీలో ఇండియా, మారిషస్‌తో పాటు సిరియా కూడా బరిలో నిలిచింది. 2018లో జరిగిన తొలి టోర్నీతో పాటు గతేడాది కూడా విజేతగా నిలిచిన 124 ర్యాంకర్ ఇండియా మూడో టైటిల్‌పై గురి పెట్టింది.
సిరియా (93వ ర్యాంక్), మారిషస్ (179వ ర్యాంక్)కు ఇండియాపై ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం మన జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. శుక్రవారం సిరియా, మారిషస్ పోటీ పడనుండగా.. ఈనెల 9న సిరియాతో ఇండియా తలపడనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఫిఫా ప్రమాణాలకు తగినట్టుగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ రూ.15 కోట్లు ఖర్చు చేశాయి. ప్లేయర్లు, అధికారుల డ్రెస్సింగ్ రూమ్స్‌ను సరికొత్తగా మార్చడంతో పాటు కొత్త ఫ్లడ్‌లైట్స్, 18 వేల బకెట్‌సీట్లు ఏర్పాటు చేశారు.