
సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు సీరియల్ అవకాశాలొస్తే చేయాలా? వద్దా? అనే డైలమాలో పడతారు. బిగ్‌స్క్రీన్ మీద మాత్రమే కనిపించాలనే ఆశతో కొందరు స్మాల్ స్క్రీన్‌కి దూరమవుతారు. చాలామంది మధ్యలోనే వదిలేస్తారు కూడా. పైగా మైథాలజీ, హిస్టారికల్ స్టోరీస్‌లో నటించి, ఆడియెన్స్‌ని మెప్పించడం చాలా కష్టం. కానీ.. ‘మోహిత్ రైనా’ ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
మహాశివుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ, ఆ పేరు వినగానే చాలామంది కళ్ల ముందుకు వచ్చే రూపం మోహిత్ రైనాదే. నిజంగా ‘శివుడు అంటే ఇలానే ఉంటాడేమో!’ అనుకునేలా నటించాడు మోహిత్. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. రీసెంట్గా ‘ది ఫ్రీలాన్సర్’ అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ జర్నీ గురించి అతని మాటల్లోనే...
‘‘మాది జమ్మూలోని కశ్మీరీ పండిట్స్ ఫ్యామిలీ. నేను అక్కడే1982, ఆగస్ట్14న పుట్టా. అక్కడి కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదివా. జమ్మూ యూనివర్సిటీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశా. మొదట్నించీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్‌తో మోడలింగ్‌లో ట్రై చేద్దామనుకున్నా. అందుకే చదువు పూర్తికాగానే ముంబై వెళ్లా. అక్కడ మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేశా. ‘మిస్టర్ ఇండియా’ మోడలింగ్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశా. అందుకు చాలా శ్రమ పడ్డా. అప్పటికి107 కిలోల బరువు ఉన్న నేను ఆ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు 29 కిలోల బరువు తగ్గా. నా కెరీర్ 2004లో మొదలైంది. ‘అంతరిక్ష్’ అనే సైన్స్ ఫిక్షన్ టీవీ షోలో మొదటిసారి స్క్రీన్ మీద కనిపించా. ఆ తర్వాత ‘మెహెర్’, ‘బాబీ’, ‘అంతరిక్ష్ – ఏక్ అమర్ కథ’ వంటి సీరియల్స్‌లో నటించా.
యూటీవీలో రెండు షోలు చేశా. నిజానికి ‘అంతరిక్ష్’ సీరియల్ నడుస్తోంది. అప్పుడు మేకర్స్ ‘మేం ఒక హాలీవుడ్ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నాం. ప్రాజెక్ట్ పేరు ‘డాన్ ముత్తు స్వామి’. అందులో నటించడానికి కొత్త వాళ్లు, కొత్త ఫేస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. నువ్వు నటిస్తావా?’ అని అడిగారు. నేను వెంటనే ‘సరే’ అని ఒప్పుకున్నా. అన్నట్టే ఆ సినిమాలో నటించా. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాంతో తిరిగి మళ్లీ టెలివిజన్‌కి వెళ్లా. ‘చెహ్రా’ అనే టీవీ సీరియల్లో చేశా. అలా సీరియల్స్ కంటిన్యూ చేశా.
పురాణాలు చదివి..
‘దేవోం కే దేవ్ మహదేవ్’ సీరియల్లో మహాశివుడి పాత్రలో నటించా. ఆ సీరియల్ 2011, డిసెంబర్18న మొదలైంది. డిసెంబర్ 14, 2014లో 820వ ఎపిసోడ్‌తో పూర్తయింది. అంటే... మూడేండ్లు ఆ సీరియల్లో శివుడిగా నటించా. ఆ టైంలో ఇండస్ట్రీలోని బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో నా పేరు కూడా ఉండేది. నాకు ఆ పాత్రలో నటించడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. చివరి ఎపిసోడ్లో ‘మహదేవుడు, జలంధర్, ఆది యోగి’గా ట్రిపుల్ రోల్లో కనిపించా. ఇలాంటి స్టోరీస్ జనాలు బాగా చూస్తారు. టీఆర్పీ కోసమని కాదు గానీ, మహాశివుడి కథ మరింత లోతుగా చెప్పడమే ఆ సీరియల్ ముఖ్య ఉద్దేశం.
మైథాలజీ క్యారెక్టర్స్‌లో నటించడం అంత ఈజీ కాదు. మేకర్స్ కూడా నన్ను సెలక్ట్ చేశాక, వెంటనే షూటింగ్ మొదలుపెట్టలేదు. ఆ క్యారెక్టర్‌లోని డెప్త్ తెలియకుండా నటించడం కష్టం అని వాళ్లకు తెలుసు. అందుకని ప్రిపరేషన్ కోసం నాక్కొంచెం టైం ఇచ్చారు. నేను ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ‘దేవ’లా మారేందుకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రిపరేషన్లో భాగంగా మెడిటేషన్ క్లాస్‌లకు వెళ్లా. పురాణాలు చదివా. శివుడి గురించి తెలుసుకునేందుకు వీలైనంత వరకు ప్రయత్నించా. ప్రతి రోజు మహదేవ్ గురించి ఒక కొత్త విషయం నేర్చుకునేవాడిని. అలా ఆ పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నటించా. మేకర్స్ కూడా ‘మనం దేవుడ్ని చూపిస్తున్నాం. కాబట్టి ఆడియెన్స్‌కి ఆయన దేవుడని నమ్మకం కలిగించేలా చూపించాలి’ అన్నారు. వీలైనంత వరకు నేచురల్‌గా చూపించే ప్రయత్నం చేశారు.
మహదేవ్ పాత్రతో పోలిస్తే జలంధర్ క్యారెక్టర్లో నటించడం కొంచెం కష్టం. కానీ, కొత్తదనం కోసం ఆ పాత్ర పెట్టారు. అందులో నెల రోజులు నటించా. అది ఛాలెంజింగ్‌గా ఉన్నప్పటికీ ఎంజాయ్ చేశా. ఆ విషయంలో నా అభిమానులే నాకు హార్డ్ వర్కింగ్ యాక్టర్ అనే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదొక్కటే కాదు... ఈ సీరియల్లో మహదేవుడిగా పదకొండు అవతారాల్లో కనిపించా. అది చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. అయినా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. నాకు కష్టమైన పనులు చేయడమే ఇష్టం. మొదట క్యారెక్టర్లోకి వెళ్లడం కొంచెం కష్టమనిపించేది. పైగా ఆ పాత్ర కూడా చాలా పెద్దది, కాబట్టి అంచనాలు పెరిగాయి. ఫిజికల్‌గా ఒక్క నిమిషంలో మహదేవ్ నుంచి మరో పాత్రలోకి వెళ్లిపోవాలి.
నా అదృష్టం ఏంటంటే... ఒకే సీరియల్లో రకరకాల షేడ్స్‌లో నటించే అవకాశం రావడం. నిజంగా ఆ సీరియల్ నా లైఫ్‌ని మార్చేసింది. దేవోం కే దేవ్ మహదేవ్’ సీరియల్ తర్వాత మళ్లీ అలాంటి మరో పెద్ద ప్రాజెక్ట్ ‘చక్రవర్తి అశోక సామ్రాట్’. మా ఫ్యామిలీ ఈ సీరియల్‌కి పెద్ద ఫ్యాన్. కొన్నిసార్లు వయసుకు మించిన పాత్రలా అనిపిస్తుంది. కానీ అది హిస్టారికల్ మాస్టర్ పీస్. అందులో భాగమైనందుకు గర్వంగా ఫీలయ్యా. అశోకుడి క్యారెక్టర్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. నటించేటప్పుడు అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి.
ఓటీటీ అయినా ఓకే!
‘ది ఫ్రీలాన్సర్’లో నేను నటించడానికి కారణం డైరెక్టర్ నీరజ్ పాండే. ఆయన తన సినిమాల్లో ఏ క్యారెక్టర్‌కి ఎవరైతే బాగుంటారనేది బాగా ఆలోచించి తీసుకుంటారు. వాళ్లు పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు కూడా. ఆయన నాకు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పగానే ఆ అవకాశం నేను వదులుకోదల్చుకోలేదు. టైం వేస్ట్ చేయకుండా వెంటనే ‘ఓకే’ చెప్పా. షూటింగ్ అప్పుడు కూడా ఆయన నాతో ఎక్కువ హోంవర్క్ చేయించలేదు. జస్ట్ ఎలా చేయాలో చెప్తాడు. ఏం చేయాలి? ఏం చేయకూడదో చేసి చూపిస్తాడు. ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయలేదు. ఇక్కడ మీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఒకరోజు ఒక సీన్ జరుగుతోంది. దాదాపు అయిదారు టేక్స్ అయితే గానీ ఆ సీన్ ఓకే చేయరు డైరెక్టర్స్ అనే ఆలోచనతోనే చేస్తున్నా.
కానీ, ఆ రోజు మాత్రం 15 నుంచి 16 టేక్స్ అయ్యాయి. అప్పటికే నాకు చెమటలు పట్టేశాయి. లేట్ అయిపోతుంది. అందరూ ఇంటికెళ్లే టైం అవుతోంది. తొమ్మిదిన్నరకు ప్యాకప్ చెప్పే టైం. అందరూ నన్నే చూస్తున్నారు. నాకేమో ఏం అర్థంకాలేదు. ఆ తర్వాత నాకు అర్థమైందేంటంటే.. ఆయనకి ‘ఓకే’ అనిపించేంత వరకు ఆ సీన్ పర్ఫెక్ట్గా రానట్లే. ఇందులో నా క్యారెక్టర్ కోసం యాక్షన్ సినిమాలు ఏవీ చూడలేదు. కానీ, చాలాకాలం కిందట నేను ‘టేకెన్’ అనే సినిమా చూశా. అది నాతోనే ట్రావెల్ చేస్తోంది. అందులో ఒక కూలీ, తన కూతుర్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఫ్రీలాన్సర్లో నేను ఫ్రెండ్ కూతుర్ని కాపాడతా. కాబట్టి నా మైండ్‌లో ఎప్పుడూ ఆ స్టోరీ తిరుగుతుంటుంది. అది నన్ను ఇన్స్పైర్ చేసిన మూవీ.
ఆర్మీ అంటే ఇష్టం!
యాక్టింగ్ కంటే ముందు నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం ఉండేది. అప్పట్లో ఆర్మీలో చేరాలనుకున్నా. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో సోల్జర్ క్యారెక్టర్లో నటించే అవకాశం దక్కింది. అందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యా. టీవీలో నటించేటప్పుడు కూడా ఛాలెంజింగ్ పాత్రలే ఎక్కువ ఇష్టపడేవాడిని. ఈ సినిమాలో విక్కీ కౌశల్, పరేశ్ రావల్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. నాకు కమర్షియల్ సినిమాలు కూడా నచ్చుతాయి. మైథాలజీ, హిస్టరీ అనే కాదు ఏ జానర్లో అయినా నటించేందుకు నేను రెడీ. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో
నేనూ ఓ భాగమవ్వాలని కోరుకుంటా.
టీవీ నుంచే..
నేను ప్రతీది టీవీ నుంచే నేర్చుకున్నా. అది అదృష్టంగానే భావిస్తా. ఒకవేళ తక్కువ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్స్, స్టోరీస్ వచ్చినా నేను నటించేందుకు రెడీనే. అందులో నా క్రియేటివిటీ, యాక్టింగ్ స్కిల్స్ పెంచుకునేందుకు ట్రై చేస్తా. ఓటీటీలో వచ్చిన ఛాన్స్ మంచిగా వాడుకుంటూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటా.
- 2022 జనవరిలో పెండ్లి అయింది. భార్య పేరు అదితి శర్మ. మాకు ఒక కూతురు ఉంది.
- మిస్టర్ ఇండియా పోటీలో టాప్ లో నిలిచా.
- ‘దేవోం కే దేవ్ మహదేవ్’ సీరియల్లో శివుడి గెటప్ వేసుకోవడానికి దాదాపు 75 నిమిషాలు పట్టేది.
- రియల్ లైఫ్‌లో కూడా శివ భక్తుడినే.
- బెస్ట్ యాక్టర్ కేటగిరీలో 2018లో ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్ దక్కింది.
- సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. టీవీ రియాలిటీ షోలకు కూడా దూరం.
- మంచి డాన్సర్‌ని. ఏదో ఒక రోజు నా డాన్స్‌తో ఆడియెన్స్‌ని అలరిస్తా.