నటనకు ఎలాగైతే భాషాభేదం ఉండదో.. పాటకు కూడా అంతే. సంగీతానికి ఏ భాష అయినా ఒక్కటే అంటోంది సింగర్ ఆర్య ధయాల్. పేరు చదవగానే ఈమె ఎవరో గుర్తు రాకపోవచ్చు. ‘బేబీ’ సినిమాలో ‘‘దేవ రాజ సేవ్య మూర్ధనే.. కీర్ణలోచనే.. అనే పాట విన్నారా? ఆ పాటతో అందరి మనసులు దోచిన అమ్మాయే ఈ ఆర్య. ఈ మలయాళీ సింగర్ తెలుగులో మొదటిపాటకే ఎంతో పేరు తెచ్చుకుంది.
మాది కేరళలోని కన్నూర్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. చిన్నప్పుడు కర్నాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా. ఆ తర్వాత నా ఆసక్తి కొద్దీ వెస్టర్న్ మ్యూజిక్ సొంతంగా ప్రాక్టీస్ చేశా. కరోనా లాక్డౌన్ టైంలో యుకెలెలీ ఇనుస్ట్రుమెంట్ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా. అలా ఇప్పుడు యుకెలెలీ వాయిస్తూ కర్నాటిక్, వెస్టర్న్ సాంగ్స్ పాడతా. ఒక్కోసారి రెండూ కలిపి ఫ్యూజన్ సాంగ్స్ కూడా పాడుతుంటా. 2019లో బెంగళూరులో మొదటిసారి ఒక కచేరీలో పాల్గొన్నా. అప్పటి నుంచే ప్రజలకు నేను బాగా తెలిశా. నేను పాట నేర్చుకున్న తర్వాత అదే పాటని యాక్టర్స్ పాడితే ఎలా ఉంటుంది? అని వాళ్ల వాయిస్‌లో పాడటానికి ట్రై చేస్తా. మా నాన్న కన్నూర్‌లో ఒక ఫినాన్స్ కంపెనీలో వర్క్ చేస్తారు.
మూడో తరగతిలోనే అరంగేట్రం
స్కూల్లో మ్యూజిక్ టీచర్ సుమ అని ఉండేవారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఇన్‌ప్లూయెన్స్ నామీద చాలా ఉంది . ఆమె ఒకసారి నన్ను ఒక పాట పాడమని అడిగారు. నేను వెంటనే పాడా. నా పాట విన్న ఆమె చాలా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత ఆమె నన్ను స్టాఫ్ రూమ్‌కి తీసుకెళ్లి, అక్కడ స్టాఫ్‌తో ‘ఈ అమ్మాయిని కర్నాటిక్ మ్యూజిక్ గ్రూప్‌లో వేయండి. బాగా పాడుతుంది’ అని రికమెండ్ చేశారు. అలా మూడో తరగతిలో కర్నాటిక్ మ్యూజిక్‌లోకి అడుగుపెట్టా.
అది స్కూల్ చదువు (12వ తరగతి) పూర్తయ్యేవరకు కంటిన్యూ అయింది. జులై, ఆగస్టు నెలల్లో ప్రాక్టీస్ క్లాసులు ఉండేవి. ఎనిమిదో తరగతి వరకు సింగింగ్ క్లాస్ల్లోనే ఎక్కువ ఉండేదాన్ని. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మాత్రం మామూలు క్లాస్‌లో కనపడేదాన్ని. ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్ ఉండేవి. లేకపోతే మాత్రం స్కూల్‌కి వెళ్లగానే ముందు మ్యూజిక్ క్లాస్‌లోకి వెళ్లేదాన్ని. అక్కడ పాటలు పాడి ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లేదాన్ని. స్కూల్లో అసెంబ్లీలో జాతీయ గీతం నేనే పాడేదాన్ని. అది అయిపోగానే మళ్లీ క్లాస్‌కి వెళ్లి సింగింగ్ ప్రాక్టీస్ చేయడం. అలా ఉండేది స్కూల్ రొటీన్ నాది.
వెస్టర్న్ మ్యూజిక్
పదోతరగతి చదివే రోజుల్లో మా స్కూల్లో ఒక గిటారిస్ట్ ఉండేవాడు. తను గిటార్తోపాటు థ్రాష్ మెటల్, మెటల్ మ్యూజిక్, రాక్ మెటల్ కూడా పర్ఫార్మ్ చేసేవాడు. అది నచ్చి తనతో కలిసి మూడు నాలుగు సాంగ్స్ పాడా. అవి పాడే టైంలో వెస్టర్న్ మ్యూజిక్ గురించి నాకు చెప్పేవాడు. అలా వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. నేను పాడుతున్నప్పుడు మధ్యమధ్యలో నేను పాడే విధానాన్ని కరెక్ట్ చేసేవాడు. ‘కర్నాటిక్లో పాడుతున్నావు.
అలా కాదు.. వెస్టర్న్‌లో పాడమ’ని చెప్పేవాడు. అలాగెందుకు జరిగేదంటే... నేను కర్నాటిక్ నేర్చుకున్నా కాబట్టి వెస్టర్న్ పాడినా అక్కడక్కడా అదే వినిపిస్తుంటుంది. ఆ రెండింటి మధ్య ఒక చిన్న లైన్ ఉంటుంది. దాన్ని పట్టుకుని పాడితే పర్ఫెక్ట్గా ఉంటుందని గైడ్ చేసేవాడు. అలా నా పన్నెండో తరగతి అయిపోయేవరకు తన దగ్గర కొంత నేర్చుకున్నా. ఆ తర్వాత మిగతా సింగర్స్ పాటలు వింటూ వెస్టర్న్ మ్యూజిక్‌లో డెవలప్ అయ్యా.
మ్యూజిక్ వీడియోలు మొదలు
నేను ఆంగ్లో ఇండియన్ గర్ల్స్ స్కూల్లో చదివా. ఆ తర్వాత పై చదువుల కోసం ‘ప్రజ్ఞాన్ కాలేజ్’లో చేర్చారు పేరెంట్స్. అప్పటి నుంచి మ్యూజిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టా. అప్పుడప్పుడే యూట్యూబ్‌లో వీడియోల ట్రెండ్ పాపులర్ అవుతోంది. అప్పటికే కవిత్వం రాయడం, పాటలు పాడటం చేస్తుండేదాన్ని. ఆ టైంలో నా టాలెంట్ నలుగురికీ తెలియాలనే ఉద్దేశంతో నా కవితల్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసేదాన్ని. అది చాలా ట్రెండ్ అవడంతో జనాల్లోకి ఇంకా వెళ్లాలనే ఆలోచన పెరిగింది.
యూట్యూబ్‌లో నా పాటల్ని అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నాకు పట్టుదల ఎక్కువ. ఎవరైనా నాకేదైనా రాదంటే వదలను. ఎలాగోలా ప్రయత్నిస్తా. ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేసేదాన్ని. అలా ప్రయత్నించిందే నా మొదటి పాట ‘ట్రై మైసెల్ఫ్’. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ‘కింగ్ ఆఫ్ మై కైండ్’ రెండో పాట. అందులో ఆడవాళ్ల కష్టాలు, బాధల గురించి చెప్పా. ఈ రెండు పాటలు నేనే రాశా.
ఒడిదుడుకులు ఎదురైనా
అమెరికన్ సింగర్ చార్లీ పుత్, నేను కలిసి ‘స్మూల్’ అనే యాప్‌లో ఒక పాట పాడాం. తను ‘వి డోంట్ టాక్ ఎనీ మోర్’ అనే వెస్టర్న్ సాంగ్ పాడుతుంటే నేను కర్నాటిక్ మ్యూజిక్‌లో ‘ఎందరో మహానుభావులు’ పాట పాడా. మధ్యలో తను పాడే వెస్టర్న్ సాంగ్ మిక్స్ చేసి మరీ పాడేదాన్ని. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అందులో నేను ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలోని ‘ఎందరో మహానుభావులు’ అనే పాట పాడా. వెస్టర్న్, క్లాసిక్ మ్యూజిక్‌లను మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఆ పాట సెలక్ట్ చేసుకున్నా.
చార్లీ పుత్‌తో కలిసి పాడిన ఆ పాటని కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశా. దాన్ని చాలామంది మెచ్చుకున్నారు. కానీ, కొందరు.. ‘వెస్టర్న్, కర్నాటిక్ మ్యూజిక్ కలిపి పాడుతున్నావ’ని నెగెటివ్ కామెంట్స్ చేశారు. కర్నాటిక్ మ్యూజిక్‌ని పద్ధతిగా పాడాలనేవారు. అంతేకాకుండా కల్చర్, జెండర్, వాయిస్ మీద రకరకాల కామెంట్లు వచ్చేవి. అంతెందుకు కచేరీలకు వెళ్తానంటే మా ఇంట్లో వాళ్లే ‘ఆడపిల్లవు వద్దు’ అనేవాళ్లు. అలా నా జర్నీలో హర్డిల్స్ బాగానే ఎదురయ్యాయి.
ఫ్యూజన్ సాంగ్స్ ఇష్టం
నేను వెస్టర్న్, కర్నాటిక్ మిక్స్ చేసి ఫ్యూజన్ సాంగ్ పాడాలి అనుకున్నా. నాతోపాటు పాడటానికి ఎవరున్నారా? అని చాలా వెతికా. అప్పుడే చార్లీపుత్తో కలిసి పాడే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి వాళ్లెవరూ దొరకలేదు. అయితే నాకు కర్నాటిక్, వెస్టర్న్ రెండూ వచ్చు. అలా రెండూ వచ్చిన వాళ్లు నాకు తోడుంటే ఫ్యూజన్ సాంగ్ ట్రై చేయొచ్చు అనుకున్నా. ఎంత వెతికినా నాకెవరూ కనిపించలేదు. దాంతో నేను ఒక్కదాన్నే పాడటం మొదలుపెట్టా.
నిజానికి కర్నాటిక్ సింగింగ్ నేర్చుకునేటప్పుడు ‘ఐ సో లోన్లీ బ్రోకెన్ ఏంజిల్’ పాట పాడేదాన్ని. స్కూల్లోనేమో ‘గాడ్ బ్లెస్ ట్రీసెస్..’ అనే పాట పాడతాం. ఈ రెండింటితో పాటు రోజూ జాతీయగీతం పాడడం.. ఇలా మూడు వేర్వేరు రకాల పాటలు పాడటం అప్పట్నించే మొదలైంది. మలయాళ, తమిళ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతా. హిందీ కొంచెం వచ్చు. తెలుగు అస్సలంటే అస్సలు రాదు. తెలుగు రాకపోయినా, పాట పాడగలిగా. అది కూడా చాలా తక్కువ టైంలో పాట నేర్చుకున్నా. పాడేటప్పుడు తప్పులు దొర్లాయి. అప్పుడు టీంలోని వాళ్లు ఎంతో ఓపికగా నేర్పించి మళ్లీ పాడించేవాళ్లు. అవకాశం వస్తే మళ్లీ మళ్లీ తెలుగులో పాటలు పాడతా” అని తన ఫ్యూజన్ మ్యూజికల్ జర్నీ గురించి చెప్పింది ఆర్య.
అమితాబ్ బచ్చన్ రియాక్షన్
అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు నా పాట వినిపించాలనేది నా డ్రీమ్. లాక్ డౌన్లో పాట పాడి ఆయనకు పంపించా. ఆ టైంలో ఆయన కరోనాతో హాస్పిటల్లో ఉన్నారు. అందుకని ఆయన దగ్గర్నుంచి రియాక్షన్ రాదనుకున్నా. కానీ, ఆశ్చర్యంగా ఆయన ‘నీ పాట చాలా బాగుంది. వెస్టర్న్, కర్నాటిక్ మ్యూజిక్‌లను మిక్స్ చేసి పాడటం అంత ఈజీ కాదు. నీలో చాలా టాలెంట్ ఉంది. నేను నీ వాయిస్‌కి ఫ్యాన్ అయిపోయా’ అని రిప్లయ్ ఇచ్చారు. నేను షాక్ అయ్యా. కానీ చాలా సంతోషంగా అనిపించింది. లైఫ్‌లో నేను మర్చిపోలేని ఎక్స్‌పీరియెన్స్ అది.
బేబీలో అవకాశం
‘బేబీ’ సినిమాలో ‘దేవరాజ..’ పాట పాడే అవకాశం రావడం నా అదృష్టం. డైరెక్టర్ సాయి రాజేశ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ నా ప్రైవేట్ ఆల్బమ్స్, షోస్‌లో పాడినవి, కవర్ సాంగ్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చూసేవాళ్లట. ‘‘ఈ పాట అనుకున్నప్పుడు నాతోనే పాడించాలనుకున్నా’’అని డైరెక్టర్ చెప్పారు. తెలుగులో నేను పాడిన మొదటి పాట ఇది. నా డెబ్యూని ప్రొడ్యూసర్, డైరెక్టర్లు చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఒక పాట కోసం సెట్ వేసి నాతో ప్రమోషనల్ సాంగ్ చేయించారు. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొచ్చి వాళ్ల ముందు ఆ సాంగ్ లాంచ్ చేసి లైవ్‌లో నాతో పాడించారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్‌తో పాటు అక్కడికి వచ్చిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా నా పాటని మెచ్చుకున్నారు. అది వండర్ఫుల్ మూమెంట్. ఆ పాటలో చాలా అర్థం ఉంది. ఆడపిల్లల మీద అలాంటి మీనింగ్ ఫుల్ పాటలు పాడటం నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం కూడా.