- పదో ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌లోనూ తగ్గని వడ్డీ రేటు
- రేట్లు తగ్గి ఉంటే పండుగ టైమ్‌లో ఇండ్ల సేల్స్ పెరిగేవి: రియల్టర్లు
న్యూఢిల్లీ : హోమ్ లోన్లను తీసుకున్న వాళ్లు వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి మరికొంత టైమ్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే కీలకమైన రెపో రేటును పదో మానిటరీ పాలసీ మీటింగ్ (ఎంపీసీ) లోనూ ఆర్‌బీఐ మార్చలేదు. 6.5 శాతం వద్దనే కొనసాగించింది. కిందటేడాది ఫిబ్రవరిలో రెపో రేటును 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచారు. అప్పటి నుంచి మార్పు లేదు. ఈసారి మీటింగ్‌లో పాలసీ వైఖరిని హాకిష్ (రేట్లు పెంచడం) నుంచి న్యూట్రల్‌కు ఆర్‌బీఐ ఎంపీసీ మార్చింది. రెపో రేటు మారకపోవడంతో దీనికి లింకై ఉన్న లాంగ్ టెర్మ్ లోన్లపై వడ్డీ కూడా తగ్గదు.
వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా ఇండ్ల ధరలను బట్టి సేల్స్ ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. నరెడ్కో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇండియాలోని టాప్ ఏడు సిటీలలో ఇండ్ల ధరలు కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే సగటున 23 శాతం పెరిగాయి. చదరపు అడుగు సగటు ధర రూ.6,800 నుంచి రూ.8,390 కి ఎగిసింది.
కానీ ఇదే టైమ్‌లో ఇండ్ల సేల్స్ మాత్రం పడ్డాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినా గ్లోబల్‌గా ఆర్థిక పరిస్థితులు నిలకడగా లేకపోవడం, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాల వలన ఆర్‌బీఐ మాత్రం రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించడానికి మొగ్గు చూపింది. కానీ, రియల్టర్లు మాత్రం ఇండ్ల డిమాండ్‌ను పెంచే మంచి ఛాన్స్ ఆర్‌బీఐ కోల్పోయిందని చెబుతున్నారు. పండుగ సీజన్ ఉండడంతో వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే సేల్స్ పెరిగేవని అంచనా వేశారు.
యథాతథంగా గ్రోత్, ఇన్‌ఫ్లేషన్ అంచనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్‌ఫ్లేషన్ అంచనాలను ఆర్‌బీఐ మార్చలేదు. సెప్టెంబర్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 3.65 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లో ఉన్నప్పటికీ, రానున్న నెలల్లో దిగొస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 2024–25 కిగాను ఇన్‌ఫ్లేషన్ అంచనాను 4.5 శాతం దగ్గర ఆర్‌బీఐ ఎంపీసీ కొనసాగించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 4.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. అలానే జీడీపీ గ్రోత్ రేట్ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను మార్చలేదు. 7.2 శాతం దగ్గర కొనసాగించింది. కానీ, సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ రేట్ 7 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. గతంలో వేసిన అంచనా 7.2 శాతం నుంచి తగ్గించింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ రేట్ 7.1 శాతంగా నమోదవుతుందని అంచనా వేయగా, 6.7 శాతంగా రికార్డయ్యింది.
కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను గమనిస్తున్నాం..
లోన్లను ఇచ్చేందుకు కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తప్పుడు విధానాలను పాటిస్తున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు తప్పుడు విధానాలను పాటిస్తున్నాయని అన్నారు. భారీగా ప్రాసెసింగ్ ఫీజులు, పెనాల్టీలు వేయడం చేస్తున్నాయని, వీటి కస్టమర్
సర్వీస్ బాగోలేదని అన్నారు. వ్యవస్థలో లోన్లకు డిమాండ్ లేకపోయినా ఇవి పెంచుతున్నాయని . వీటితో ఆర్థిక స్థిరత్వానికి దెబ్బని పేర్కొన్నారు. వీటిని ఆర్‌బీఐ గమనిస్తోందని అన్నారు.
యూపీఐ లిమిట్ పెంపు
యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ.2 వేల నుంచి రూ.5 వేలకు ఆర్‌బీఐ ఎంపీసీ పెంచింది. అలానే ఒక ట్రాన్సాక్షన్‌లో చేసే అమౌంట్ లిమిట్‌ను రూ.100 నుంచి రూ.500 కు పెంచింది. మరోవైపు ఫీచర్ ఫోన్లలో వాడే యూపీఐ123పే లిమిట్‌ను కూడా పొడిగించింది. ఒక ట్రాన్సాక్షన్‌పై రూ.10 వేల వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ.5 వేలుగా ఉన్న లిమిట్‌ను ఆర్‌బీఐ ఎంపీసీ పెంచింది.