టాలీవుడ్ స్టార్ హీరో సాయి దుర్గ తేజ్ విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గతంలో సాయి తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష, బ్రో చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఈసారి సాయి తేజ్ రూట్ మార్చాడు. ఈ క్రమంలో ఏకంగా ప్యాన్ ఇండియాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రజలని పట్టి పీడిస్తున్న అరాచక శక్తుల్ని అంతం చేసి జనాలని రక్షించే గొప్ప వీరుడి స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది.
ఈ రోజు (అక్టోబర్ 15) సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ ఎస్డిటీ-18 చిత్రానికి సంబంధించిన ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి దుర్గ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఇక విజువల్స్ లోని పల్లెటూరు, మంటల్లోనుంచి హీరో ఎంట్రీ ఎస్డిటీ-18 సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం తదితర పాన్-ఇండియా భాషలలో విడుదల కానుంది.