ఐ యాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా.. న్యూజిలాండ్ పీఎం క్రిస్టోఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐ యాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా.. న్యూజిలాండ్ పీఎం క్రిస్టోఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత దేశానికి తాను పెద్ద అభిమానినని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అన్నారు. లావోస్‌లో జరుగుతున్న ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ రెండు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. లావోస్ పర్యటనలో ఉన్న మోడీ.. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‎తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలపై ఇరువురు ప్రధానులు చర్చించారు. ఈ భేటీ అనంతరం న్యూజిలాండ్ పీఎం లక్సన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. భారత్ నేను విపరీతంగా ప్రేమించే, ఆరాధించే దేశమని తన అభిమానాన్ని చాటుకున్నారు. న్యూజిలాండ్‎లో ఉన్న భారతీయులు బాగా పని చేస్తారని కొనియాడారు. 

ఇండియన్స్ చాలా కష్టపడి పని చేస్తారన్నారు. ఇక మోడీతో సమావేశం కావడంపై స్పందిస్తూ.. భారత ప్రధాని మోడీతో అద్భుతమైన సమావేశం జరిగిందని తెలిపారు. భారతదేశంతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలనే తన సంకల్పాన్ని మోడీ ముందు వ్యక్తం చేశానని పేర్కొన్నారు. భారత్‎తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. న్యూజిలాండ్ ప్రధానితో భేటీ అయిన విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి మిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట పాలనకు కట్టుబడి ఉన్న న్యూజిలాండ్‌తో స్నేహానికి మేము విలువ ఇస్తున్నామని అన్నారు.

మా చర్చలు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సహకారం, పర్యాటకం, విద్య, ఆవిష్కరణ వంటి అంశాలపై జరిగాయని వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం, విద్య, డెయిరీ, అగ్రి-టెక్, క్రీడలు, పర్యాటకం, అంతరిక్షం, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై న్యూజిలాండ్, భారత ప్రధానులు చర్చించారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలన్న న్యూజిలాండ్ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారని తెలిపింది.