వరంగల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా,- మూసీ పునర్జీవం ఒక మహోత్తరమైన ఐడియా అని కొనియాడిన మహేష్ గౌడ్.. ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 2024, నవంబర్ 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో శనివారం (నవంబర్ 16) మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైడ్రా వల్ల గత బీఆర్ఎస్ పాలనలోని భూ బకాసురులకే భయమని.. హైడ్రాతో పేదలకు ఎలాంటి భయం, ఆందోళన అవసరం లేదని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నా.. హైడ్రా, మూసీ ప్రక్షాళన అవసరమా..? లేదా..? ఆయన వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భారీ ప్రాజెక్ట్ మూసీ పునర్జీవం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 11 నెలల పాలనను పురస్కరించుకుని ఈ నెల19వ తేదీన హనుమకొండలో ప్రగతి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ALSO READ | వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో BRS ఉండదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరా మహిళ శక్తి ప్రాంగణంలో ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తోన్న ఈ సభ లక్ష మంది మహిళలు తరలివస్తారని చెప్పారు. వరంగల్ సెంటిమెంట్‌తోనే ఇక్కడ భారీ సభ నిర్వహిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వమని అభివర్ణించారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో మాట్లాడుతున్నాడని.. తప్పు చేశాడు కాబట్టే కేటీఆర్ జైలుకు వెళ్ళాడనికి సిద్ధంగా ఉన్నాడని.. అందుకే జైలుకు పోతా.. పోతా అంటున్నాడని విమర్శించారు.