మార్పు మొదలు.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‎పై వినేష్ ఫొగట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మార్పు మొదలు.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‎పై వినేష్ ఫొగట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఛండీఘర్: హర్యానా ఎగ్జిట్ పోల్స్‎పై  ప్రముఖ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం (2024, అక్టోబర్ 5) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై వినేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది హర్యానా ప్రజలకు చాలా సంతోషకరమైన రోజని అన్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో ఓటింగ్‎లో పాల్గొని బీజేపీని గద్దె దించడంలో పాలుపంచుకుని.. హర్యానా వెతుకుతున్న మార్పును పదేళ్ల తర్వాత తీసుకువచ్చారని పేర్కొన్నారు.

గత 10 సంవత్సరాలుగా హర్యానా ప్రజలు అనుభవించిన ఫలితమే ఇదన్నారు. కాగా, ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‎లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేష్ ఫొగట్.. 100 గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా టోర్నీ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల అనంతరం రెజ్లింగ్‎కు గుడ్ బై చెప్పిన వినేష్.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సెకండ్స్ ఇన్సింగ్ ప్రారంభించారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జులనా అసెంబ్లీ నుండి బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి వినేష్ ఫొగట్ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది తెలియాలంటే హర్యానా ఎన్నికల కౌంటింగ్ అక్టోబర్ 8వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇక, శనివారం (2024, అక్టోబర్ 6) వెలువడిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఈ సారి హర్యానాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోందని స్పష్టం చేశాయి. 

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (46 సీట్లు) కాంగ్రెస్ పార్టీ సునాయసంగా సాధిస్తోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మరీ హర్యానాలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందో తెలియాలంటే 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.