సిరిసిల్ల: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్ల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సారి అలాంటి తప్పులు చేయొద్దని.. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం (జవనరి 4) కేటీఆర్ ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్ల పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలల గడిచిన ఆరు గ్యారంటీలలో అర గ్యారంటీ మాత్రమే అమలు అయ్యిందని విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు.. కానీ ఒక్క గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ పూర్తి కాలేదని ఆరోపించారు. తెలంగాణలోని ఏ ఊరుకి అయిన పోయి అడుగుదాం.. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మరోసారి సవాల్ విసిరారు. సర్వశిక్షా అభియాన్ టీచర్లకు చాయ్ తాగేలోపు బాధలు తీరుస్తా అని ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించాడని ఫైర్ అయ్యారు.
Also Read : కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్
రైతు ప్రమాణ హామీ పత్రం ఇస్తేనే రైతు బంధు ఇస్తానని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి రైతు బంధు లేదు అంటున్నారు. అన్నిట్లో కోతలు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్లా తయారయ్యాడని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుణ్యం వల్లనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు నీళ్లు వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూకంపం వచ్చిన కుంగలేదుని.. ఎలాగైనా ఆ ప్రాజెక్టును కూలగొట్టి కేసీఆర్‌కు చెడ్డపేరు తేవాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రతి గడప గడపకు ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. అధికారులు, పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన రాసిపెట్టుకోండి.. మన ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిద్దామని కేడర్‌కు ధైర్యం చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని.. ఇందుకోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని కోరారు. ప్రజల కోసం పోరాటం చేస్తూ కేసులకు బయపడకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు బనాయిస్తే ప్రతి కార్యకర్తకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.