- ముథోల్ సెగ్మెంట్లో టికెట్ల చిచ్చు.. బీఆర్ఎస్లో ముసలం
- సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అభ్యర్థిత్వంపై తిరుగుబాటు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ టికెట్ల వ్యవహారం ఇక్కడి అధికార బీఆర్ఎస్, బీజేపీలో దుమారం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఇవ్వొద్దంటూ కొద్ది రోజులుగా డిమాండ్ చేసిన అసంతృప్త ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. అసమ్మతి నేతలందరినీ తన రాజీ ఫార్ములాతో మంత్రి కేటీఆర్ ఏకతాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన రాజీ ఫార్ములా అట్టర్ ఫ్లాప్ అయిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి.
బుజ్జగించినా వినని నేతలు
అసంతృప్తి వాదులతో మూడు సార్లు సమావేశమైన కేటీఆర్ వారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఆయన వారిని బుజ్జగిస్తూ పరోక్షంగా హెచ్చరించారు. విఠల్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్‌తోపాటు అసమ్మతి వాదులతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ఆదేశాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే కేటీఆర్ ముందు తలలూపిన అసంతృప్తివాదులు నియోజకవర్గానికి రాగానే పాత స్వరాన్ని అందుకున్నారు. విఠల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే పార్టీ ఓటమి తప్పదంటూ బహిరంగంగానే చెప్పారు. అయినా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబుతో పాటు మరో 10 మంది సీనియర్ ప్రజాప్రతినిధులు ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకేసారి 11మంది తమ పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడంతో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలన్న టెన్షన్ అటు పార్టీని, ఇటు అభ్యర్థిని వెంటాడుతోంది.
ఆ 11 మంది వీరే..
బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, భైంసా జడ్పీటీసీ సోలంకి దీప భీమ్ రావు పటేల్, బాసర ఎంపీపీ సునీత విశ్వనాథ పటేల్, బాసర జడ్పీటీసీ వసంత రమేశ్, భైంసా మాజీ జడ్పీటీసీ నీలాబాయి రామకృష్ణ పటేల్, లోకేశ్వరం మాజీ జడ్పీటీసీ శోభా సురేశ్, ముథోల్ మాజీ జడ్పీటీసీ ప్రమీల రాజేశ్వర్, పాంగ్రి సర్పంచ్ అనూష బాయ్, ముథోల్ జాగృతి సమితి అధ్యక్షుడు పండిత్ రావు పటేల్, హాజ్గుల్ సర్పంచ్ ప్రకాశ్ పటేల్, పుష్పూరు ఎంపీటీసీ లింగాల నర్సవ్వ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
వీరితోపాటు కుంటాల మాజీ ఎంపీపీ భర్త జీవీ రమణారావు, సీనియర్ నాయకులు మెండె శ్రీధర్, చిన్నారావు, ఆంజనేయులు సహా మరో 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. వీరంతా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ కు మద్దతుగా కాషాయ కండువాలు కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.