పరిచయం : వీధి నాటకాల నుంచి ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు..ఏకైక ఇండియన్ యాక్టర్..అతనెవరోకాదు..శశాంక్​

పరిచయం : వీధి నాటకాల నుంచి  ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు..ఏకైక ఇండియన్ యాక్టర్..అతనెవరోకాదు..శశాంక్​

నటుడిగానే కాకుండా రచయిత, సంగీత కళాకారుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ బాలీవుడ్ నటుడు. కేన్స్, సన్​డాన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్స్​లో అధికారికం​గా పోటీపడిన ఏకైక ఇండియన్ యాక్టర్​ కూడా ఇతనే. అతనెవరోకాదు.. శశాంక్​ అరోరా. తన గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవే. 

న్యూఢిల్లీకి చెందిన శశాంక్ తండ్రి గ్రాఫిక్ డిజైనర్, తల్లి రచయిత కాగా శశాంక్​కి సిస్టర్​ పెయింటర్. ఇలా ఇంట్లో వాళ్లంతా కళలపై మక్కువ చూపేవారు. వాళ్లతో కలిసి ఆర్టిస్టిక్​ ప్రపంచంలో పెరగడం వల్లే తనకు కూడా కళలపై ఆసక్తి వచ్చిందంటాడు అరోరా. మొదటి నుంచి వాళ్ల ప్రభావం తన మీద ఉండేది. పైగా స్వతహాగా శశాంక్​కి సంగీతం, నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం ఉండేది. దాంతో హైస్కూల్ చదువు పూర్తవ్వగానే పై చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ చదువుతోపాటు నటన, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్​ కూడా నేర్చుకున్నాడు. మానవ హక్కుల కోసం పోరాడే యాక్టివిస్ట్​లకు చెందిన వీధి నాటకాలు వేసే గ్రూపులో చేరాడు. ఢిల్లీలోనూ వీధి నాటకాల్లో నటించాడు. 

2008లో ముంబైకి వచ్చిన శశాంక్ రెండేండ్లపాటు యాక్టింగ్​ కోర్సు చేశాడు. ఆ తర్వాత యాక్టింగ్ ఇనిస్టిట్యూట్​లో గెస్ట్ టీచర్​గా, కాస్టింగ్​ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్​గా పనిచేశాడు. అలా చేస్తూనే యాక్టింగ్ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేసేవాడు. ‘మ్యోహో’ అనే సినిమాతో 2012లో సినిమాల్లో సపోర్టింగ్​ పాత్రలో నటించాడు. 2014లో ‘టిట్లీ’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో పోటీపడింది. ఆ సినిమాకు గాను శశాంక్​ కూడా ఫిల్మ్​ఫేర్, స్టార్​డస్ట్, స్టార్ స్క్రీన్​, జీ సినీ వంటి అవార్డ్​లకు బెస్ట్ డెబ్యూ యాక్టర్​గా నామినేట్​ అయ్యాడు. 2016లో ‘బ్రహ్మన్​ నమన్’ సినిమా సన్​డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో పోటీపడింది. అలా ఈ రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్​లోనూ పోటీపడిన ఏకైక నటుడు శశాంక్​. 

ప్రస్తుతం సినిమాలతోపాటు మేడ్​ ఇన్​ హెవెన్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్​, తనావ్​ వంటి వెబ్​ సిరీస్​లతో పలు భాషల్లో ఆడియెన్స్​కి మరింత చేరువయ్యాడు. లేటెస్ట్​గా ఓటీటీలో స్ట్రీమ్​ అవుతోన్న ‘తనావ్​ –2’ వెబ్​ సిరీస్​లో జునైద్​ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. తనావ్​.. రెండు సీజన్లు కలిపి 24 ఎపిసోడ్లు ఉంటుంది. ఈ సిరీస్​ సోనీలివ్​లో తెలుగుతోపాటు మరో ఆరు  భాషల్లో అందుబాటులో ఉంది. 

తనావ్​ 2లో జునైద్​గా..

‘‘ఇందులో నా రోల్ పేరు జునైద్. సౌత్​ కాశ్మీర్​కి చెందిన కుర్రాడిగా కనిపిస్తా. చిన్నతనంలో అతను హింస, చావు, అన్యాయం వంటివి చూస్తూ పెరిగాడు. అక్కడ జరిగే పాలిటిక్స్, అక్కడి వారి మిషన్​ ఎజెండా వంటివి తన మైండ్​లో నాటుకుపోతాయి. ఇలాంటి క్యారెక్టర్​ నేనెప్పుడూ చేయలేదు. జునైద్​లాంటి ఒక మైండ్ సెట్​ ఉన్న కాశ్మీరీ కుర్రాడిగా నటించడం చాలా కష్టం అనిపించింది.

ఆ కుర్రాళ్ల ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. నా పాత్ర కొన్నిసార్లు భయపెడుతుంది కూడా. ఇకపోతే కాశ్మీరీ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టం. దాంతో నేను ఉర్దూ, కశ్మీరీ మిక్స్​ చేసి మాట్లాడాను. అది ఆడియెన్స్, మరీ ముఖ్యంగా రెండు భాషలూ వచ్చినవాళ్లు నేను మాట్లాడింది యాక్సెప్ట్ చేస్తారా? లేదా అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఒక ఆర్టిస్ట్​గా ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా రియాలిటీని చూపించడం మా బాధ్యత.’’

ఆ సినిమాకు మ్యూజిక్​..

కాలేజీలో ఉన్నప్పుడు మ్యుజీషియన్ అవ్వాలనుకునేవాడట శశాంక్. నటనకంటే మ్యూజిక్​ ఇంకాస్త ఎక్కువ ఇష్టం అంటాడు. అందులోనే తనకు శాటిస్​ఫాక్షన్ ఉంటుందంటాడు శశాంక్​. ఆ ఇష్టంతోనే కెరీర్​ బిగినింగ్​లోనే మ్యూజిక్ టాలెంట్​ని కూడా బయటపెట్టాడు. నివిన్​ పౌలీ లీడ్‌‌‌‌ రోల్​లో చేసిన ‘ముతొన్’​ అనే మలయాళ సినిమాలో సలీం అనే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమాలోని ‘బిఖ్రే’ అనే పాటకు మ్యూజిక్​ కంపోజ్ చేసి తన లక్​ పరీక్షించుకున్నాడు.

అంతేనా... 2019లో విడుదలైన ఆ సినిమాకి మంచి రెస్పాన్స్‌‌‌‌ కూడా వచ్చింది. ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్​ యాక్టర్​ కేటగిరీలో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సిన్సిన్నాటి’ అవార్డ్​ కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది వరుసగా ‘మేరే సాథియాన్’, ‘ధమ్కీ’, ‘ఓడ్​ టు బటర్ చికెన్​ పార్ట్​ –1’ వంటి పాటలు కంపోజ్ చేశాడు.