జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల గురించి ఆసక్తికమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న మహమ్మద్ షానవాజ్‌ను ఇవాళ (అక్టోబర్ 2న) ఉదయం ఢిల్లీలో అరెస్టు చేశారు. ఎన్‌ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మరో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, మోరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురినీ ఢిల్లీకి తరలించారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
విచారణలో భాగంగా ముగ్గురు నిందితులు కీలక విషయాలను వెల్లడించిన్లట్లు పోలీసులు తెలిపారు. వీరు ఎవరికీ అనుమానం రాకుండా వేర్వేరు చోట్ల ఉంటూ కలిసి పని చేస్తున్నారని తెలిపారు. వీరంతా వృత్తి రీత్యా ఇంజినీర్లు. బాంబుల తయారీలో ఈ ముగ్గురూ నిష్ణాతులని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ సీనియర్ అధికారి హెచ్‌జీఎస్ ధళివాల్ చెప్పారు.
మహమ్మద్ షానవాజ్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీ మాడ్యుల్ ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురూ కలిసి దేశవ్యాప్తంగా వివిధ చోట్ల ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు చెబుతున్నారు. వారి నుంచి ఒక తుపాకీ, బాంబుల తయారీకి ఉపయోగించే కెమికల్స్, జిహాదీ లిటరేచర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముగ్గురు నిందితులు వేర్వేరు చోట్ల ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక మార్గాల్లో తమ రిపోర్టులను పరస్పరం పంచుకునేవారని అన్నారు. తమకు అవసరమైన పరికరాలను స్థానికంగానే సమకూర్చుకోవడం వల్ల వాళ్లేం చేస్తున్నారన్నది ఇంతవరకు బయటపడలేదని చెప్పారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...
ఝార్ఖండ్‌కు చెందిన మహమ్మద్ షానవాజ్ మైనింగ్ ఇంజినీరింగ్ చదివాడు. బాంబుల తయారీలో చాలా అనుభవం ఉంది. ఇతర మతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. షానవాజ్ అరెస్టుతో ఆమె పరారీలో ఉంది.
మరో అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ అర్షద్ వారిస్ కూడా ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తే. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అలీగఢ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందాడు. ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్నాడు.
మరో అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ రిజ్వాన్ అష్రాఫ్‌ది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజాంగఢ్. అతడు కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఇంకా ఈ కేసులో ఎంతమంది ఉన్నారు...? ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలనుకున్నారు అనే కోణాల్లో విచారిస్తున్నారు. వారికి సహకరిస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు.