ధన్యవాదాలు సార్.. మహబూబాబాద్ ​ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బాధితుడు

ధన్యవాదాలు సార్.. మహబూబాబాద్ ​ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బాధితుడు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం గుండ్రాతిమ డుగు గ్రామానికి చెందిన పత్తి వెంకన్న తన సమస్య పరిష్కారం కావడంతో శనివారం ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేతన్, జూనియర్ సివిల్  జడ్జి తిరుపతికి ధన్యవాదాలు తెలుపుతూ కోర్టు ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నాడు.

వివరాలిలా ఉన్నాయి.. వెంకన్న తన కొడుకుకు హైదరాబాద్​లోని ఓ ఇంజనీరింగ్  కాలేజీలో సీటు కోసం మేడ్చల్ కు చెందిన కొండల్ రెడ్డి అనే వ్యక్తికి రూ.2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై సతీశ్​ కొండల్​రెడ్డిని పోలీస్  స్టేషన్ కు పిలిపించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నాడు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి బాధితుడికి రూ.2 లక్షలు ఇప్పించారు. దీంతో ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి బాధితుడు క్షీరాభిషేకం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నాడు.