నిజామాబాద్ జిల్లాలో కీలకంగా ఉండే అర్బన్ సెగ్మెంట్ లో ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. బలమైన కమ్యూనిటీగా ఉన్న వర్గం వారంతా ఒకమాట మీదికి వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొంతకాలంగా సెగ్మెంట్ పరిధిలో మున్నూరు కాపు వర్గం నేతల సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా తమ వర్గం నేతకే అండగా ఉండాలన్న వాదనను ఈ మీటింగ్ లలో లీడర్లు బలంగా చెబుతున్నారు. సెగ్మెంట్ లో కీలకంగా ఉన్నా... చాలాకాలంగా తమ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదనీ, ఈసారి తమ వర్గం వారికే పదవులు రావాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పరిణామాలను గమనించిన కొందరు లీడర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. సామాజిక వర్గం నేతలను కలుపుకొని తాము కూడా కార్యక్రమాలు, విందులు నిర్వహిస్తున్నారు. తమకు అండగా ఉండాలని అడుగుతున్నారు. స్థానికేతరులు, ఇతరులను కూడా ఆదరించామనీ, ఈసారైనా తమ వర్గం నేత ఉండాలన్న భావనను వేర్వేరు పార్టీల్లో ఉన్న మున్నూరుకాపు లీడర్లు కూడా వినిపిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో ఉన్న గౌరవం ఇప్పుడు లేదన్న బాధ, కోపాన్ని ఆ వర్గం పెద్దలు కొందరు బలంగా వినిపిస్తున్నారు. అందుకే ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చామని చెబుతున్నారు.
రాజకీయ పండితుల అంచనాలకు అందని సెగ్మెంట్ గా అర్బన్ కు పేరుంది. ఊహించని అభ్యర్థులను గెలిపించే ట్రాక్ రికార్డు ఈ నియోజకవర్గం సొంతం. ఇక్కడి నుంచే చాలామంది రాజకీయ జీవితం మొదలుపెట్టినవాళ్లున్నారు. మున్నూరు కాపుల ఓటర్లు 20 శాతానికి పైగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఏడాదిలో ఆ వర్గం యాక్టివిటీ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల మీద ఒత్తిడి పెంచుతోంది. అధికార పార్టీ సహా అన్ని పార్టీల్లోనూ మున్నూరు కాపు నేతలు యాక్టివ్ అయ్యారు. మారిన పరిస్థితుల్లో దీనిపై సీరియస్ గా ఆలోచించాల్సిన పరిస్థితి అన్ని పార్టీల్లో ఉందంటున్నారు. మరోవైపు ఇతర వర్గాల నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు మున్నూరుకాపులను కూడా కలుపుకొనేలా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=BNX5m9ZIqHM