
లక్సెట్టిపేట వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. 10 మంది కౌన్సిలర్లు గత నెల 6న అవిశ్వాస తీర్మానానికి నోటీస్ అందజేయగా మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు దక్కినట్లేనని అంతా భావించినప్పటికీ రాజకీయాలు రోజురోజుకు మలుపులు తిరుగుతున్నాయి. మున్సిపాలిటీలో 15 మంది సభ్యులకు గాను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, మరొకరు ఇండిపెండెంట్‌గా ఎన్నికయ్యారు.
దీంతో బీఆర్ఎస్ నుంచి చైర్మన్‌గా నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ గా పొడేటి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంతోపాటు, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇండిపెండెంట్‌తో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆ పార్టీ బలం 9కి చేరింది.
9వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ కాంగ్రెస్‌లో చేరనప్పటికీ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.గత నెల 6న కలెక్టర్ కార్యాలయంలో ఈ 10 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి మున్సిపాలిటీని హస్తగతం చేసుసుకేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. అవిశ్వాసం వీగి పోవడానికి బీఆర్ఎస్ కూడా పైఎత్తులు వేస్తోంది.