హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హై కోర్టు విచారణ చేపట్టింది. 2024, అక్టోబర్ 28న ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.. విచారణ సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై కీలక వాఖ్యలు చేశారు.
‘‘హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో దాదాపు 55 నుండి 60 పబ్బులు ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రతి రోజూ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. పబ్‌ల బయట డ్రైవ్‌లు పెట్టీ ప్రమాదాలను నివారించాలి. బడా బాబులు సంపాదిస్తుంటే, వారి పిల్లలు పబ్‌లలో హంగామా చేస్తూ ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్నారు’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పబ్‌లకు సైతం కొన్ని నిబంధనలు విధించాలని ఈ మేరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన సూచించారు.
మరోవైపు, జన్వాడ ఫామ్ హౌస్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని.. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల కోర్టును ఆశ్రయించాడు. రాజ్ పాకాల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు రెండు రోజుల సమయం ఇచ్చింది. రెండు రోజుల తర్వాత పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.