నల్గొండ, వెలుగు : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాక సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం క్లాక్‌టవర్ సెంటర్లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సభకు ఎంపీలు ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లా అగ్రనేతలు అందరూ రేవంత్ సభలో పాల్గొనడం, ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేయడం పార్టీ కేడర్‌లో జోష్ నింపింది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్‌రెడ్డి సొంత నియోజకవర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జానారెడ్డి చేసిన కృషిని వివరించడమేగాక, మంత్రి పదవి త్యాగం చేసిన వెంకట్ రెడ్డిని కొండా లక్ష్మణ్ బాపూజీతో పోల్చారు. పౌరషం కలిగిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని కీర్తించడ మేగాక, సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
ఆపరేషన్జానా!
నల్గొండలో రేవంత్ సభను సక్సెస్ చేయడంలో పార్టీ సీనియర్ నాయకు డు జానారెడ్డి సక్సెస్ అయ్యారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలందరని ఏకతాటికి పైకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీ సీనియర్‌నాయకుడు జానారెడ్డి భుజానెత్తుకున్నారు. ఇదే రకమైన పంథాను ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జానారెడ్డి అన్నారు. పార్టీ గెలుపు కోసం, తాను సమైఖ్య యోధుడిగా పాటుపడతానని చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా తామంతా కలిసికట్టుగానే ఉన్నామని, చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిన్నింటిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తామని ఎంపీ వెంకట్ రెడ్డి సైతం రేవంత్మద్దతు తెలిపారు. ప్రధాని మోడీని కలినంత మాత్రాన బీజేపీలో చేరినట్టుకాదని, అట్లాగే రేవంత్ నల్గొండకు రానంత మాత్రాన తాను అడ్డు చెప్పినట్టు కాదని, పరి స్థితులను బట్టి తామే రేవంత్‌ను నల్గొండకు ఆహ్వానిద్దామని అనుకున్నా మని వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలిచి సాధిస్తామన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు సైతం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగానే ఉన్నామని చెప్పారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సభకు రావడం, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయడం పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాష్ నేత, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, చెవిటి వెంకన్న యాదవ్, బత్తుల లక్ష్మారెడ్డి, కొండేటి మల్లయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.