ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా.. అప్పుడే వణికిపోతే ఎలా..? కేటీఆర్

ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా.. అప్పుడే వణికిపోతే ఎలా..? కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రులు విమర్శలు వర్షం కురిపించారు. ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసు నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాజీ కుదుర్చుకోవడం కోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో కేటీఆర్ తన ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా.. హైదరాబాద్ లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది. అప్పుడే వణికిపోతే ఎలా..?’’ అంటూ మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్‎గా ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ స్కీమ్‎లో అక్రమాలు జరిగాయని గత కొన్ని రోజులుగా కేటీఆర్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. 

ALSO READ | ఏడేడు లోకాల అవతల ఉన్నా.. ఏ దొరనూ వదిలేదు: మంత్రి పొంగులేటి వార్నింగ్

ఈ స్కీమ్‎లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల బంధువులకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టాబెట్టారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. అమృత్ పథకంలో అవకతవకలు జరిగాయంటూ కేటీఆర్ ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం (నవంబర్ 11) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‎ను కలిసి అమృత్ టెండర్ల అంశంపై చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. దీంతో కేటీఆర్ ఢిల్లీ టూర్‎పై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు చేస్తుండటంతో కేటీఆర్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.