అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? కవిత ట్వీట్

హైదరాబాద్: సోలార్ క్రాంటాక్టులు దక్కించుకోవడం కోసం భారత ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదు కావడం.. అతడిని అరెస్ట్ చేయాలంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీపై అమెరికా చేసిన అవినీతి ఆరోపణలు భారత్ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ప్రధాని మోడీతో కలిసి అదానీ అవినీతికి పాల్పడ్డడంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది. 

అదానీ వ్యవహరంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ రాజుకుంది. ఈ క్రమంలో అదానీ అవినీతి ఇష్యూపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన కవిత కేంద్ర ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా..? అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..?’’ అని కవిత కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించారు. 

రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేసి నెలల తరబడి విచారణలో ఉంచుతారు. అదే గౌతమ్ అదానీపై పదే పదే తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన స్వేచ్ఛగా తిరుగున్నారని.. అదానీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేదేమిటీ అని ప్రశ్నించారు. వారు అఖండ భారత్‌ను ప్రచారం చేస్తారు కానీ సెలెక్టివ్ జస్టిస్‌ను అందిస్తారని సెటైర్ వేశారు. 

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు ఆమె జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత జైలు నుండి రిలీజ్ అయ్యారు. ఈ క్రమంలో అదానీ ఇష్యూపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కవిత చేసిన ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి.