- ఇంట్రెస్టింగ్గా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నిక
- బీజేపీ నుంచి బరిలో సిట్టింగ్ ఎంపీ కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్
- బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
హైదరాబాద్, వెలుగు : ఇద్దరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ఎంపీ మధ్య పోటీతో సికింద్రాబాద్పార్లమెంట్నియోజక వర్గ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ స్థానంలో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీలో ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్కాంగ్రెస్లో చేరగా, ఆయనకు సికింద్రాబాద్‌పార్లమెంట్ టికెట్ కేటాయించారు. సమీకరణాలు అంచనా వేసుకొని సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావుకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇక సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది.
ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీ మధ్య ఫైట్ జరుగనున్నది. మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారడం, ఆయనను ఎదుర్కొనేందుకు మరొక ఎమ్మెల్యే రంగంలోకి దిగడం.. బీజేపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్‌రెడ్డి తో వీరు తలపడుతుండటం.. ‘లష్కర్’ ఎన్నిక సర్వత్రా ఆసక్తి పెంచుతున్నది.