- మొదట్లో పోటీకి విముఖత చూపిన పాలమూరు సిట్టింగ్ ఎంపీ
- తప్పని పరిస్థితిలో టికెట్ కన్ఫర్మ్ చేసిన బీఆర్‌ఎస్ హైకమాండ్
- నాలుగు రోజుల కిందటి వరకు సైలెంట్
- బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలో భాగమేనని ప్రచారం
- సడన్‌గా ప్రచారానికి దిగిన మాజీ ఎంపీ
- లీడర్లు, కేడర్‌తో సమావేశాలు, ఇంటింటి ప్రచారం
మహబూబ్‌నగర్, వెలుగు : కొన్ని రోజుల కిందటి వరకు సైలెంట్‌గా ఉన్న మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ క్యాండిడేట్ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ కావడంతో సెగ్మెంట్‌లో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. మొదట పోటీలో ఉండేందుకే ఇంట్రస్ట్ చూపని మన్నెకు హైకమాండ్ తప్పనిసరి పరిస్థితిలో టికెట్ కేటాయించింది. అయినప్పటికీ ఆయన ప్రచారానికి దూరంగా ఉండడంతో అసలు పోటీలో ఉంటారా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనూహ్యంగా ఫీల్డ్‌లోకి దిగిన ఆయన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.
మొదట్లో పోటీకి ఇంట్రస్ట్ చూపని మన్నె
ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీల అధినేతల్లో ఒకరైన మన్నె శ్రీనివాస్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగి 4,11,402 ఓట్లు సాధించారు. బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ, కాంగ్రెస్ క్యాండిడేట్ చల్లా వంశీచంద్‌రెడ్డిపై 77,829 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే అప్పటి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించలేదని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానించేవారని ఆరోపణలు వినిపించాయి. లీడర్ల వ్యవహారంతో విసిగిపోయిన ఆయన ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.
దీనికి తోడు ఈ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రులను గానీ, మాజీ ఎమ్మెల్యేలను గానీ బరిలోకి దింపాలని కేసీఆర్ భావించారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో వారు పోటీకి ‘నో’ చెప్పారు. దీంతో తప్పని పరిస్థితిలో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం ప్రచారానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. ఉగాది పండుగ తర్వాత క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేస్తారన్న చర్చ నడిచినా అదీ జరగలేదు. చివరకు ఆయన పోటీలో ఉంటారా ? ఉండరా ? అన్న సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తం అయ్యాయి.
బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర ఆరోపణలతో...
బీఆర్‌ఎస్ క్యాండిడేట్ ఇంతకాలం ప్రచారానికి దూరంగా ఉండడంతో కాంగ్రెస్ క్యాండిడేట్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని, బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో అలర్ట్ అయిన బీఆర్‌ఎస్ క్యాండిడేట్ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. త్వరలో మిగతా నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సిట్టింగ్ సీటును చేజార్చుకోరాదని, ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి సైతం సమావేశాలకు హాజరవుతున్నారు.
ద్విముఖ పోరు నుంచి ట్రయాంగిల్ ఫైట్
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ క్యాండిడేట్ సైలెంట్ కావడంతో నాలుగు రోజుల కిందటి వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరే నడిచింది. ఈ రెండు పార్టీల క్యాండిడేట్లు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో పాలమూరు రాజకీయం వేడెక్కింది. కానీ తాజాగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎంట్రీతో ద్విముఖ పోటీ కాస్త ట్రయాంగిల్ ఫైట్‌గా మారింది. మన్నె సీన్‌లోకి రావడం, మాజీలందరినీ కలుపుకొని పోతుండడంతో ఎవరి ఓట్లు చీలుస్తారోనని కాంగ్రెస్, బీజేపీ కేడర్‌లో ఆందోళన నెలకొంది. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లపై ఈయనకు పట్టు ఉండడం కలిసివస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.