సత్యనారాయణపురం దర్గాలో రాములోరి కల్యాణం

సత్యనారాయణపురం దర్గాలో రాములోరి కల్యాణం
  • ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలో నిర్వహణ
  • పెనుబల్లిలో ముస్లిం ఇంటి నుంచే మొదటి తలంబ్రాలు

ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు మండలంలోని సత్యనారాయణపురం హజరత్‌‌‌‌‌‌‌‌ ఖాసిమ్‌‌‌‌‌‌‌‌ మౌలాచాన్‌‌‌‌‌‌‌‌ దర్గాలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన వేదికపై హనుమ సమేత సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేసి కల్యాణాన్ని జరిపించారు. స్థానిక ఆదివాసీ మహిళలు (పోకల దమ్మక్క వారసులు) సంప్రదాయ రీతిలో గోటితో తీసిన బియ్యాన్ని తలంబ్రాలుగా వాడారు.

 సోమవారం శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పూజారి లక్ష్మీనారాయణ, పుట్ట శ్రీనివాస్, శ్రీనివాస్, పులిగళ్ల మాధవరావు, దర్గా కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. దర్గా మాలిక్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణకు స్వామి వారు కలలో కనిపించి.. సత్యనారాయణపురం గ్రామంలో అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరగాలని చెప్పడంతో 2013 నుంచి దర్గాలో సీతారాముల కల్యాణం జరిపిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.

ముస్లిం ఫ్యామిలీ నుంచే మొదటి తలంబ్రాలు

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో ప్రతియేడాది నిర్వహించే సీతారాముల కల్యాణానికి గ్రామానికి చెందిన ముస్లిం ఫ్యామిలీ నుంచే మొదటి తలంబ్రాలు అందిస్తున్నారు. 2016లో రామచంద్రాపురం సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన కరీముల్లా గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ప్రతి శ్రీరామనవమికి అతడి ఇంటి నుంచే మొదటి తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీగా మారింది. కరీముల్లా తన పొలంలో పండిన ధాన్యంలో రాములవారికి తలంబ్రాలు తీసిన తర్వాతే మిగతా పంటను అమ్ముకుంటారని గ్రామస్తులు తెలిపారు.