ఎవుసానికి అంతంతే..

ఎవుసానికి అంతంతే..

న్యూఢిల్లీ:  మధ్యంతర బడ్జెట్ లో మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయింపులు నామమాత్రంగానే పెరిగాయి. అలాగే ఇతర ప్రధాన రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికే అత్యంత తక్కువగా నిధులు అలకేట్ అయ్యాయి. ఎవుసానికి గత బడ్జెట్ తో పోలిస్తే ఈ సారి రూ. 2 వేల కోట్లు మాత్రమే ఎక్కువగా కేటాయించారు. మధ్యంతర బడ్జెట్ 2024-25లో వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 1,27,469 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మల అలకేట్ చేశారు. 2023-24 బడ్జెట్ లో అగ్రికల్చర్ సెక్టార్ కు రూ. 1.25 లక్షల కోట్లను కేటాయించగా, ఈ సారి అలకేషన్స్ రూ. 2 వేల కోట్లే పెంచారు.

ఇందులో పీఎం కిసాన్ స్కీంకు రూ. 60 వేల కోట్లు అలకేట్ చేశారు. దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు పీఎం కిసాన్ యోజన కింద పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామన్నారు. పీఎం కిసాన్ సంపద యోజన కింద 38 లక్షల రైతులు లబ్ధి పొందారని, 10 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.

పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ యోజన ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలకు సాయం అందిందన్నారు. పంటకోతల తర్వాత నష్టాలను తగ్గించేందుకు కూడా వివిధ పథకాలను తెచ్చామన్నారు. వీటి వల్ల వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉత్పాదకత, ఆదాయం పెరుగుతోందన్నారు. మోడ్రన్ స్టోరేజ్, సప్లై చైన్స్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి వాటిలో పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ–నామ్)తో 1,361 మండీలను అనుసంధానం చేశామని, వీటిద్వారా 1.8 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్ల మేరకు వాణిజ్య లబ్ధి జరిగిందన్నారు.  

నూనె గింజల ఉత్పత్తి పెరగాలె 

నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధత సాధించే దిశగా 2022లో ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ ను ప్రారంభించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఆవ, వేరుశనగ, సోయా, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యేక స్ట్రాటజీని రూపొందిస్తామన్నారు. ఇందులో భాగంగా అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలపై పరిశోధన, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అమలు, మార్కెటింగ్, సేకరణ, వ్యాల్యూ యాడిషన్, పంటల బీమా వంటివి అమలు చేస్తామన్నారు. వివిధ పంటలకు నానో లిక్విడ్ యూరియా (డీఏపీ) వాడకం విజయవంతంగా జరిగినందున ఇకపై అన్ని అగ్రోక్లైమాటిక్ జోన్లలోని పంటలకు నానో యూరియా వాడకాన్ని విస్తరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

పాడి, మత్స్య రైతులకు ప్రోత్సాహం 

ఫిషరీస్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని వల్ల కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. పీఎం మత్స్య సంపద స్కీంతో ఆక్వా కల్చర్ ఉత్పాదకతనూ పెంచుతామని చెప్పారు. సీ ఫుడ్ ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకునేలా ఈ స్కీంను అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే పాడి రైతులకు మద్దతు కోసం ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించనుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.