హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లోని 26 ఎకరాలను నకిలీ పత్రాలతో విక్రయించారని ఆరోపిస్తూ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ అదనపు ఎస్పీ శివా నందరెడ్డిని, ఆయన భార్య, కుమారుడిని మంగళవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఇప్పటికే అరెస్టు చేసుంటే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని తెలిపింది. హైదరాబాద్‌లోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్కను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ వాళ్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారించారు. పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని పిటిషనర్ లాయర్ వాదించారు. దీనిపై హైకోర్టు పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్లపై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.