- వెంటనే విద్యార్థుల ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశం
అమరావతి: ఏపీలో జూనియర్ కాలేజీలు దూకుడుగా వ్యవహరిస్తుండడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. ప్రభుత్వం.. బోర్డు నోటిఫికేషన్ ఇవ్వకముందే కొన్ని జూనియర్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటుండడంపై ఇంటర్ బోర్డు విస్మయం వ్యక్తం చేసింది. విద్యాశాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతలు లేకుండా అడ్మిషన్లు ఎలా నిర్వహిస్తారని ఇంటర్ బోర్డు ప్రశ్నించింది. అడ్మిషన్లు తీసుకున్న కాలేజీలు వెంటనే విద్యార్థులకు ఫీజులు వెనక్కి ఇవ్వాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.
కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తమ దృష్టికొచ్చిందని, ఇలాంటి అనధికారిక అడ్మిషన్లను చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.