
ఆరు తప్పులు ఉన్నట్టుప్రకటించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తప్పులు వచ్చాయి. మంగళవారం మ్యాథ్స్–ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు ఎగ్జామ్స్ జరగ్గా.. ఆయా ఎగ్జామ్స్‌లో పలు తప్పులు దొర్లాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు.. సీఎస్, డీవోలకు ‘ఎరాట’ పంపించారు. బాటనీ ఇంగ్లిష్ మీడియం పేపర్‌లో 5వ క్వశ్చన్‌లో ఇట్ ఈజ్ ఫౌండ్ అని రావాల్సి ఉండగా.. ఈజ్ ఇట్ ఫౌండ్ అని వచ్చింది. 13వ క్వశ్చన్‌లో శాఖీయకు బదులు శాధీయ అని ప్రింట్ చేశారు. పొలిటికల్ సైన్స్ ఇంగ్లిష్ మీడియంలో 32వ క్వశ్చన్‌లో ఇంపార్టెంట్‌కు బదులు ఇంపార్టెన్స్ ఆఫ్ అని వచ్చింది. పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియంలో 20వ ప్రశ్నలో జాతికి బదులు జాతీయత అని పడింది. మ్యాథ్స్–ఏ తెలుగు మీడియంలో 4వ ప్రశ్నలో కోటికి బదులు శ్రేణి అని వచ్చింది.
9వ ప్రశ్నలో ప్రయేయాన్ని అని రావాల్సి ఉండగా.. ప్రమేయానికి అని వచ్చింది. ఇలా పలు క్వశ్చన్లు అర్థంకాక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఆరు తప్పులను అధికారులు ప్రకటించగా.. వాళ్లు పంపించిన ‘ఎరాట’ను కొందరు సీఎస్, డీవోలు చూడలేదని తెలుస్తున్నది. పలు సెంటర్లలో సీఎస్, డీవోలు ఫోన్లు యూజ్ చేయొద్దనే నిబంధనతోనే ఇలా జరిగినట్టు సమాచారం. దీంతో ఎరాట వివరాలను తమకు వెల్లడించలేదని స్టూడెంట్లు ఆరోపించారు. కాగా, మంగళవారం జరిగిన ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 5,53,423 మంది హాజరుకావాల్సి ఉండగా, 5,29,649 మంది అటెండ్ అయ్యారు. మరో 23,774 మంది హాజరుకాలేదు. నల్గొండలో ముగ్గురు, నిజామాబాద్,కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.