
- ఏజెన్సీలో అంతంత మాత్రంగానే ఆటో సర్వీసులు
- రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్... ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ నెల 5 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏజెన్సీ నుంచి పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని పేరేంట్స్ కోరుతున్నారు. ఏజెన్సీ పల్లెల నుంచి 20-, 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఎగ్జామ్ సెంటర్ కు స్టూడెంట్స్ వెళ్లనున్నారు. ఈ మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు పరిమితంగా ఉండడం, ఆటో సర్వీసులు తక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
బస్సు లేకపోతే ఎగ్జామ్ ఎలా రాయాలి?
కొత్తగూడెం, ఇల్లెందు, దమ్మపేట, జూలూరుపాడు, కరకగూడెం, సుజాతనగర్, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల్లోని విద్యార్థులు దాదాపు 10 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి ఎగ్జామ్స్ రాయాలి. కొత్తగూడెం ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు రేగళ్ల, బంగారు చెలక, సుజాతనగర్, జూలూరుపాడు, అన్నపరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి వెళ్లాలి. జూలూరుపాడులో ఉన్న ఎగ్జామ్ సెంటర్‌ను కూడా సరైన సౌకర్యాలు లేవని ఈ సారి కొత్తగూడెంకు మార్చారు.
దీంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థులు 20 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగించాలి. కరకగూడెం నుంచి 52 మంది కేజీబీవీ విద్యార్థులు 6 కిలోమీటర్ల దూరం ఉన్న పినపాక సెంటర్ కు ఎగ్జామ్ రాయటానికి వెళ్లాలి. కొమరారం, పోలారం, మాణిక్యారం ప్రాంతాల విద్యార్థులు ఇల్లెందుకు రావాల్సి ఉంది. ఆళ్లపల్లి మండలంలోని మార్కోడ్ విద్యార్థులు 30 కిలోమీటర్ల దూరంలోని గుండాలకు వెళ్లాలి. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు బస్సు మిస్ అయితే, ఆటోల్లో వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు నడిపితే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 36 ఎగ్జామ్ సెంటర్లు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈసారి 19,258 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ 9,255 మంది, రెండో సంవత్సరానికి 10,003 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. మొత్తం 36 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కొత్తగా ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీలో కూడా ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు చేశాం
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆఫీసర్లను ఇప్పటికే కోరాం. పరిశుభ్రమైన తాగునీటితో పాటు ఎగ్జామ్స్ టైంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు విన్నవించాం. ఎగ్జామ్స్ సెంటర్లలో ఏఎన్ఎంలు ఉండేలా వైద్యశాఖకు లేఖ రాశాం. ఒక్క నిమిషం నిబంధన ఉన్న మూలంగా స్టూడెంట్స్ అరగంట ముందుగానే ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
హెచ్. వెంకటేశ్వరరావు, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్, భద్రాద్రికొత్తగూడెం