- ఒకేషనల్ స్టూడెంట్స్ పరిస్థితి మరీ దారుణం
- రెండు దశాబ్దాల నాటి పరికరాలతోనే ప్రాక్టికల్స్
- ఎక్స్పైరీ అయిన రసాయనాలతోనే సరిపెడుతున్న ఫ్యాకల్టీలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కు సరైన సౌకర్యాలు, పరికరాలు లేవు. ఒకేషనల్ స్టూడెంట్స్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల కాలం నాటి మూలకు పడిన పరికరాలతో అధికారులు మమ అనిపిస్తున్నారు. థియరీకే ప్రాధాన్యం ఇస్తూ ప్రాక్టికల్స్‌ను పట్టించుకోవడం లేదు.
ఎక్స్పైరీ కెమికల్స్‌తోనే ప్రాక్టికల్స్..
ఇంటర్ విద్యార్థులకు ఏటా ఫిబ్రవరిలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అక్టోబర్ నుంచే ప్రాక్టికల్స్ మొదలు పెట్టాల్సి ఉంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 14 సర్కార్ జూనియర్ కాలేజీలున్నాయి. జిల్లాలో గవర్నమెంట్, కస్తూర్బా, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, టీఎస్ ఆర్జేసీ, మైనార్టీకాలేజీల్లో దాదాపు ఐదే వేల మంది ఫస్ట్ ఇయర్, 5,500 మందికి పైగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్‌లో ఫస్ట్ ఇయర్ లో దాదాపు 4,700మందికి పైగా, సెకండ్ ఇయర్లో 4,876 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.
ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ సబ్జెక్ట్లతో పాటు ఒకేషనల్కోర్సులలో అక్టోబర్ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రం అరకొరగా ప్రాక్టికల్స్ మొదలు పెట్టారు. కానీ ప్రైవేటు కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ల్యాబ్‌ల తాళాలు ఇంకా తెరుచుకోలేదు. ఫిజిక్స్ ల్యాబ్‌లో పాతకాలం నాటి పరికరాలతో ప్రాక్టికల్స్ చేపిస్తున్నారు. ప్రాక్టికల్స్‌లో ప్రధానంగా ఉపయోగించే పరికరాలు, కెమికల్స్ పూర్తిగా అందుబాటులో లేవు. ఉన్న వeటిలో చాలా వరకు ఎక్స్పైరీ అయినవే.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జూనియర్ కాలేజీలో ల్యాబ్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకేషనల్ విభాగంలో కొన్ని పరికరాలున్నప్పటికీ లెక్చరర్లు మాత్రం వాటిని ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బొటనీ, జువాలజీ విభాగంలో అందుబాటులో ఉన్న పరికరాలతో ప్రాక్టికల్స్ చేపిస్తున్నారు. దీంతో కేవలం ప్రాక్టికల్స్‌కు సంబంధించిన రికార్డులతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది.
రెండు దశాబ్దాల కాలం నాటివే
ఒకేషనల్ కోర్సులు చదివే స్టూడెంట్స్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఎటువంటి మెటీరియల్‌ను గతంలోని ప్రభుత్వాలు సమకూర్చలేదు. ఓకేషనల్ కోర్సుల్లో ప్రధానంగా ఆటో మొబైల్స్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్స్ టెక్నీషియన్స్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, మెకానికల్ ఇంజినీరింగ్,మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, లైఫ్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయి. కానీ ఆయా కోర్సులకు సంబంధించి పరికరాలు లేక, లెక్చరర్లు థియరీతోనే సరిపెట్టుకుంటున్నారు.