- హై కమాండ్ సైలెన్స్
- ఎమ్మెల్యేల పరేషాన్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం పెరుగుతోంది. బహిరంగ వేదికల మీదనే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆశావహులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నా.. హై కమాండ్ సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది అసమ్మతి నేతలతో పాటు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించడంలో పార్టీ అధిష్టానం పెద్దగా స్పందించడం లేదు.
ఎమ్మెల్యేలకు తలనొప్పి ఎమ్మెల్యే టికెట్ఆశిస్తున్న నేతల తీరుపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై అధిష్టానం దృష్టి సారించడం లేనట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు అసహనానికి గురవుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత శ్రీహరి రావు ఇటీవల బహిరంగంగా విమర్శలు చేశారు. ఇప్పటివరకు ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి చర్య తీసుకోలేదు. కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్న సత్యనారాయణ గౌడ్ వ్యవహార శైలిపై ఇప్పటివరకు అధిష్టానం జోక్యం చేసుకోకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖానాపూర్ సెగ్మెంట్ లో అధికార బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఖానాపూర్ నియోజక వర్గంలో చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న వారు.. కొంతకాలం నుంచి సెగ్మెంట్ లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా పర్యటిస్తున్న ఆశావహులంతా మంత్రి కేటీఆర్ కు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు సన్నిహితులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్ కు సన్నిహితునిగా చెప్పుకుంటున్న భూక్య జాన్సన్ నాయక్ నాలుగైదు నెలల నుంచి ఖానాపూర్ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యే రేఖా నాయక్ పేరు ఎత్తకుండా కేటీఆర్, కేసీఆర్ పేర్లను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కడెం, జన్నారం, దస్తూరాబాద్ మండలాలకు చెందిన కొంతమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ వెంట తిరుగుతున్నారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అనుచరునిగా చెప్పుకుంటున్న పూర్ణచంద్రనాయక్ కూడా సామాజిక కార్యక్రమాల పేరిట గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరిద్దరి కార్యకలాపాలను సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్ ఎప్పటికప్పుడు గమనిస్తున్నప్పటికీ అడ్డుకోలేని పరిస్థితి. క్రమంగా వీరి పర్యటనలు ఊపందుకుంటుండడం, సోషల్ మీడియా లో ప్రతిరోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో వీరికి దీటుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కౌంటర్ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో మంత్రి కేటీఆర్ తో భూక్య జాన్సన్ నాయక్ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తూ ఇక టికెట్ ఆయనకేనని ప్రచారం జరుపుతుండడం ఆసక్తి రేకేత్తిస్తోంది.
ఫిర్యాదులు బేఖాతర్...
నిర్మల్ లో శ్రీహరి రావు సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ లకు అనుకూలంగానే మాట్లాడుతూ కేవలం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో భూక్య జాన్సన్ నాయక్, పూర్ణ చంద్రనాయక్ తదితరులు పరోక్షంగా తనకు పోటీ కార్యక్రమాలు సాగిస్తున్నారంటూ ఎమ్మెల్యే రేఖ నాయక్ ఇప్పటికే పలు సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు జాన్సన్ నాయక్, పూర్ణచం ద్రనాయక్ కార్యకలాపాలపై స్పందించడం లేదు. మంత్రి కేటీఆర్ పరోక్షంగా భూక్య జాన్సన్ నాయక్ ను ప్రోత్సహిస్తున్నారని ఆయనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఖాయమన్న హామీని కూడా ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే రేఖ నాయక్ వ్యతిరేక వర్గీయులంతా ఒక్కటై ఇక్కడ జాన్సన్ నాయక్‌కు అండగా నిలుస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆయనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం ఇప్పటి నుంచే చేస్తుండడం పార్టీ వర్గాల్లో అయోమయానికి కారణమవుతుందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ భూక్య జాన్సన్ నాయక్, పూర్ణ నాయక్ ల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేయబోతున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.