- టీ డయాగ్నొస్టిక్ సెంటర్ ఓపెనింగ్ కు రాని ఎమ్మెల్యే
- జడ్పీ చైర్మన్ ఆధర్యంలోప్రోగ్రాం
యాదాద్రి, వెలుగు : బీఆర్ఎస్ లో జడ్పీ చైర్ పర్సన్ , ఎమ్మెల్యే మధ్య సఖ్యత కుదరలేదు. టీ డయాగ్నొస్టిక్ సెంటర్ ఓపెనింగ్ కు ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉన్నా హాజరు కాలేదు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా టీ డయాగ్నొస్టిక్ సెంటర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్ గా ప్రారంభించారు. భువనగిరిలోని టీ డయాగ్నొస్టిక్ సెంటర్ఓపెనింగ్ లో పాల్గొనాలని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించారు.
అయినా ఆయన పాల్గొనలేదు. దీంతో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రోగ్రామ్ నిర్వహించారు. డయాగ్నొస్టిక్ కొత్త బిల్డింగ్ తో పాటు మిషనరీ, శాంపిల్స్ సేకరించడానికి ఏర్పాటు చేసిన 5 డీ అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు.
ముందు నుంచీ అంతే..
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు. మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి కొడుకైన సందీప్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే టికెట్ఆశిస్తుండగా.. మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కారణమే ఇద్దరి మధ్య దూరం పెంచిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గం రాయగిరిలో నిర్వహించిన ఆధ్యాత్మికత దినోత్సవానికి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి ఆహ్వానమే అందలేదు. ఈ ప్రోగ్రాంకు శేఖర్‌రెడ్డి రాకున్నా.. మంత్రి గుంటకండ్ల, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి హాజరయ్యారు. ఈ విషయంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అలకవహించిన సంగతి తెలిసిందే.