కామారెడ్డి జిల్లా బీఆర్​ఎస్​లో అంతర్గత విభేదాలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా బీఆర్​ఎస్​లో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో స్థానిక సంస్థల్లో అవిశ్వాసాలు, కొందరు పార్టీని వీడుతుండటం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.  

లీడర్లు అసంతృప్తి.. 

ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిల్​లో మెజార్టీ కౌన్సిలర్లు చైర్మన్ కుడుముల సురేందర్, వైస్​ చైర్​పర్సన్​పై సుజాతపై అవిశ్వాసానికి తెరలేపారు. 12 మంది కౌన్సిలర్లలో ఏడుగురు   చైర్​పర్సన్​పై అసంతృప్తిలోఉన్నారు. ఇలా ఎల్లారెడ్డి కౌన్సిల్​ ప్రజాప్రతినిధుల మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్​ దృష్టికి తీసుకెళ్లినా  గతంలో ఆయన పట్టించుకోకపోవడంతో  అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఏడుగురు కౌన్సిలర్లు రెడీ అయ్యారు. అసంతృప్తిలో ఉన్న కౌన్సిలర్లు ఇటీవల టూర్​కు కూడా వెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్​బుధవారం వారితో మాట్లాడారు. 3 రోజుల పాటు వారితో చర్చించి, టూర్​లో ఉన్న వారిని హైదరాబాద్​కు రప్పించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కలిసి కట్టుగా ఉందామని, అభివృద్ధికి కృషి చేద్దామని సముదాయించారు. మరో వైపు ఇదే నియోజక వర్గంలోని ఇద్దరు సర్పంచులు బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. సదాశివనగర్​ వైస్​ ఎంపీపీ శ్రీనివాస్​రెడ్డి కూడా పార్టీకి గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేరారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీలో అసంతృప్తులు పెరుగుతుండటం ఎమ్మెల్యేలను, లీడర్లను   ఆందోళనకు గురి చేస్తోంది. దీంతోపాటు  ఎల్లారెడ్డి నియోజక వర్గంలో సింగిల్​ విండోలో చైర్మన్లపై అవిశ్వాసాలు పెట్టడటానికి డైరెక్టర్లు పావులు కదుపుతున్నారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్​లో కూడా మూడు గ్రూపులు అయ్యాయి. ఒక వర్గమంటే మరో వర్గానికి పడటం లేదు. ఫండ్స్​ కేటాయింపుల్లో కొన్ని వార్డులపై అధిక ప్రయార్టీ ఇస్తున్నారని పలువురు కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. 

ప్రతిపక్షాల గురి..

అధికార బీఆర్​ఎస్​ పార్టీలో నెలకొన్న ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి.   ఎమ్మెల్యేలపై, పార్టీ ముఖ్య లీడర్లపై అసంతృప్తి ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కిందస్థాయి నాయకులను ఆపేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. మండలాల వారీగా సమ్మేళనాలు నిర్వహించి, శ్రేణులతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఈ అసంతృప్తి తగ్గే సూచనలు కనబడటం లేదు.