బీఆర్ఎస్​లో భగ్గుమన్న వర్గపోరు

  • మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిపై నార్కెట్ పల్లి నేతల అసహనం
  • పార్టీ కార్యక్రమాలకు తనను పిలవడం లేదంటూ ఆవేదన 

నార్కెట్ పల్లి,వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి  బీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. దీక్ష దివస్ పై ఏర్పాట్లపై గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ మరోసారి నేతల మధ్య వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

గత 11నెలలుగా పార్టీ పరంగా పిలిచిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల మహబూబాబాద్ లో కేటీఆర్ పర్యటనలో కార్యకర్తలు ఫొటోతో ఫ్లెక్సీ పెడితే తీసేయాలని కార్యకర్తలకు  ఫోన్ చేసి ఒత్తిడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చాక మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఓడిపోయాడని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగయ్యను పక్కన పెట్టి ప్రెస్ మీట్ నిర్వహించారు.

శుక్రవారం నల్లగొండ లో జరిగే దీక్ష దివస్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో  సొంత నేతలపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.