- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రుతిమించిన విభేదాలు..
- పాత, కొత్త నేతల మధ్య కయ్యం
- హుజూరాబాద్, వరంగల్ తూర్పు, తాండూర్, మహబూబాబాద్ లోనూ వివాదాలు
- వడ్ల ధర్నాలో రచ్చకెక్కిన గొడవలు
- ఇంకొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులా గ్రూప్ పాలిటిక్స్
- పట్టించుకోని నాయకత్వం
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు లొల్లులు ముదురుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం వీటితోనే అట్టుడుకుతున్నది. అనేకసార్లు పాత, కొత్త నేతల మధ్య పంచాది పోలీస్స్టేషన్ల దాకా వెళ్లింది. హుజూరాబాద్, వరంగల్ తూర్పు, తాండూరు, స్టేషన్ ఘన్ పూర్, కొల్లాపూర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య అంతరాలు రచ్చకెక్కాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని కొందరు తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు. పార్టీకో, ప్రభుత్వానికో అవసరమైతే తప్ప నేతల మధ్య సర్దుబాటుకు టీఆర్ఎస్ హైకమాండ్ కనీసం ప్రయత్నించడం లేదని లీడర్లు గరం అవుతున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా, తమను అణచివేసినవాళ్లనే నెత్తిన పెట్టుకుంటున్నారని మండిపడుతున్నారు.
పార్టీ మారే ప్రయత్నాల్లో లీడర్లు
రాష్ట్రంలో కనీసం 30కి పైగా నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్‌లో బహు నాయకత్వం ఉంది. అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. వారిలో ఒకరిద్దరికి మాత్రమే పదవులు ఇచ్చారు. మిగతా వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ నాయకుల అనుచరులకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. కనీసం చిన్నపాటి పదవులు కూడా దక్కడం లేదు. దీంతో వాళ్లంతా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరారు. ఆయన బాటలోనే టీఆర్ఎస్ ను వీడేందుకు చాలా మంది నేతలు దారులు వెతుక్కుంటున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూపుల లొల్లి కొనసాగుతున్నది. ఈ జిల్లాలో ఒక్క ఖమ్మం అసెంబ్లీలో తప్ప మరెక్కడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలువలేదు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు హరిప్రియా నాయక్ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో దాదాపు జిల్లా మొత్తం కొత్తగా పార్టీలో చేరిన వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. గతంలో టీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే కారణమని పలువురు అభ్యర్థులు నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి కంప్లయింట్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇవ్వకున్నా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నారు. మొన్న జరిగిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అతికష్టమ్మీద గెలిచారు. భారీగా అధికార పార్టీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేశారు. ఈక్రాస్ ఓటింగ్‌కూ పొంగులేటి కారణమని కొందరు లీడర్లు మళ్లీ కంప్లయింట్ చేశారు. కొంతకాలం కింద పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య పరస్పరం దాడులకు దారితీసింది. ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పాత నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య పూడ్చలేనంత అగాథం ఉంది. పాత నేతల్లో ఎక్కువమంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే ఉన్నారు. సీఎం కేసీఆర్ వనపర్తి పర్యటనకు ఆహ్వానం అందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం మీటింగ్ కొనసాగుతున్న సమయంలోనే ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటితో మంతనాలు జరిపారు. ఆ సమయంలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవి ఉన్నారు. అసెంబ్లీకి ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి ఆధ్వర్యంలో కీలక నేతలంతా సమాయత్తం అవుతున్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన వడ్ల ర్యాలీలో సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కౌన్సిలర్ భర్త బైక్‌తో ఢీకొట్టి కిందపడేశాడు. ర్యాలీలో ఆమె కన్నీటి పర్యంతమైతే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సర్ది చెప్పారు.
వరంగల్ తూర్పులో మూడు ముక్కలాట
వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యే, మేయర్ మధ్యనే విభేదాలుండగా, తాజాగా సీన్ లోకి ప్రదీప్ రావు వచ్చి చేరారు. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆయా నేతల అనుచరులు చింపేసి గొడవపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ఈ ముగ్గురు నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన వడ్ల ధర్నాకు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మొదట దూరంగా ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడి నుంచి వెళ్లిన తర్వాతే ఎమ్మెల్యే వేదిక పైకి వచ్చారు. దీంతో వరంగల్ తూర్పులో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా తయారైంది.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎత్తులు పైఎత్తులు
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తన కూతురు కావ్యను పోటీ చేయించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నించారు. కానీ పార్టీ నాయకత్వం మళ్లీ తాటికొండ రాజయ్యనే అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనకు కడియం వర్గం నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. అధిష్టానం దూతగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నీతానై వ్యవహరించి రాజయ్య గెలుపు కోసం పనిచేశారు. గెలిచిన తర్వాత కడియం వర్గీయులకు పదవులు, టికెట్లు ఇవ్వకుండా రాజయ్య అడ్డుపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎలాగైనా తన కుమార్తెను పోటీ చేయించాలని కడియం ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ పార్టీని వీడిన తర్వాత సీనియర్ నాయకులకు కేసీఆర్ మళ్లీ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి మళ్లీ డిప్యూటీ సీఎం హోదా దక్కుతుందనే చర్చ మొదలైంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నది. పార్టీలోని కొందరు నేతలు కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
తాండూరులో పట్నం, పైలెట్ వర్గాల ఫైట్
తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు అనేక సందర్భాల్లో ఘర్షణలకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పలు సందర్భాల్లో మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి భార్య, జెడ్పీటీసీగా కుమారుడికి చాన్స్ ఇచ్చినా.. తన వర్గీయుల్లో ఎక్కువ మందికి పదవులు రాకుండా రోహిత్ అడ్డుపడ్డారని మహేందర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.
నకిరేకల్‌లో టికెట్ పంచాది
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ‘మాది అంటే.. మాది’ అని ఇరువర్గాల నేతలు చెప్పుకుంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.
అవసరాలకు తప్ప పట్టించుకోని హైకమాండ్
పార్టీకో, ప్రభుత్వానికో అవసరం ఉంటే తప్ప అసమ్మతి నేతలను టీఆర్ఎస్ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం కష్టపడ్డ నేతలెందరో నామినేటెడ్ పోస్టుల కోసం తెలంగాణ భవన్, ప్రగతిభవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యమంలో తమను అణచివేసిన వారిని తెచ్చి నెత్తిన పెట్టుకొని, తమను గాలికొదిలేశారని వాళ్లలో చాలా మంది బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్‌లో అందరి ముందే లొల్లి
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ ఎమ్మెల్యేకు సఖ్యత లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వడ్ల ధర్నాకు పార్టీ జిల్లా అధ్యక్షురాలి హోదాలో ఎంపీ మాలోతు కవిత అధ్యక్షత వహించేందుకు సిద్ధమవగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలోంచి మైక్ గుంజుకొని తానే అధ్యక్షత వహించారు. అదే వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. ఈ పరిస్థితిని చూసి అక్కడివాళ్లంతా కంగుతిన్నారు.
18న ఖమ్మంలో
కేటీఆర్ లంచ్ మీటింగ్
లీడర్ల మధ్య సఖ్యతకు ప్రయత్నం
20న వరంగల్‌లో పర్యటన
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు లంచ్ మీటింగ్ ప్లాన్ చేశారు. ఖమ్మం నగరంలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం కేటీఆర్ ఈ నెల 18న ఖమ్మం రానున్నారు. ఈ సందర్భంగా లంచ్ ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ లంచ్ మీటింగ్ సందర్భంగా తుమ్మల, పొంగులేటి, పువ్వాడ అజయ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేటీఆర్ ప్లాన్ చేసినట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఈ నెల 20న కేటీఆర్ వరంగల్ పర్యటన చేపట్టనున్నారు. వరంగల్ తూర్పు, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ గులాబీ లీడర్లు, ఎమ్మెల్యే, ఎంపీల మధ్య నడిచిన సైలెంట్ వార్ ఇప్పుడు రచ్చకెక్కడంతో సరిదిద్దేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.