
- నన్ను నమ్మిన క్యాడర్ కు పనులు చేయలేకపోతున్నా
- కాంగ్రెస్ సిర్పూర్ ఇన్చార్జి రావి శ్రీనివాస్
కాగ జ్ నగర్, వెలుగు: సిర్పూరు కాగజ్‌నగర్ కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్సీ దండె విఠల్‌కే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని.. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడంలేదని అసెంబ్లీ ఇన్చార్జి రావి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు ఎమ్మెల్సీ తీరుస్తారని చెప్తుండడం ఇబ్బందిగా మారిందని వాపోయారు. రావి శ్రీనివాస్ బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంటికి వెళ్లారు.
ఎమ్మెల్సీ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడారు. మొదటినుంచి పార్టీలో ఉన్న తన క్యాడర్‌కు పనులు కావడం లేదని, వాటిని పట్టించుకోవాలని అడిగేందుకే ఎమ్మెల్సీని కలిసేందుకు వచ్చినట్టు చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని ఎమ్మెల్సీ పార్టీలో చేర్చుకొని వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానం దృష్టి పెట్టాలని కోరారు.
తానేమన్నా తప్పు చేస్తే చెప్పాలని, అందరి ముందు క్షమాపణ చెప్తానన్నారు. అనంతరం అసెంబ్లీలో బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దాల దేవయ్య, నాయకులు పాల్గొన్నారు