ప్రవీణ్​రెడ్డి వర్సెస్​ పొన్నం..హుస్నాబాద్ ఎవరికి?

  • ‘హుస్నాబాద్’ ఎవరికి?
  • పట్టువీడని సీపీఐ
  • కాంగ్రెస్​నుంచి పోటీపడుతున్న  ప్రవీణ్​రెడ్డి, పొన్నం
  • సెకండ్​ లిస్టులోనూ హుస్నాబాద్ అభ్యర్థి పేరు అనుమానమే?

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​ సీటుపై కాంగ్రెస్, సీపీఐ పట్టువీడడం లేదు. రెండు పార్టీలూ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోవైపు ఈ టికెట్​ కోసం కాంగ్రెస్​లో ఇద్దరు ఆశావహులు నువ్వా–నేనా అన్నట్టు కొట్లాడుతున్నారు. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఈ సీటును సీపీఐకి కేటాయించవద్దని పార్టీ హైకమాండ్​ను కోరుతూనే టికెట్​కోసం ఎవరికివారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను కేటాయించారని వార్తలు వస్తున్నాయి. 

కానీ అవి ఊహాగానాలేనని, తమకు కీలక స్థానమైన హుస్నాబాద్​ను ఎలా వదులుకుంటామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ‘వెలుగు’తో అన్నారు. దీనిపై కాంగ్రెస్​హైకమాండ్​తో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ సెకండ్​లిస్టులో హుస్నాబాద్​అభ్యర్థి పేరు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్​ క్యాండిడేట్​నే  రంగంలో ఉంచితే ఫలితం ఉంటుందని హుస్నాబాద్​ఎమ్మెల్యే టికెట్​కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ఇటీవల మీడియా సమావేశంలో అన్నారు.

 క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసి సీపీఐ కూడా ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్, సీపీఐ స్నేహపూర్వక పోటీ చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అది కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2009లో అదే జరిగిందని అంటున్నారు. అప్పుడు టీఆర్ఎస్, సీపీఐ పొత్తు కుదుర్చుకోగా, హుస్నా బాద్ సీటుపై రెండు పార్టీలూ పట్టుబట్టాయి. టీఆర్ఎస్ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి స్నేహపూర్వక పోటీ చేశారు. ఈ ఇద్దరూ ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గెలిచారు. 

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సీపీఐ పట్టువీడకపోవడంతో హుస్నాబాద్ లో క్షేత్రస్థాయి  పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ​సర్వే ద్వారా తెలుసుకుంది. పార్టీ టికెట్​ఆశిస్తున్నవారికి ప్రజల్లో ఏపాటి బలముందో కూడా ఫ్లాష్​ సర్వే ద్వారా అంచనా వేసింది. ఈ సర్వేతో అభ్యర్థి ఎవరనేది ఎప్పుడో తేలిపోయిందని, ఆచితూచి అభ్యర్థి పేరు ప్రకటిస్తారని  కాంగ్రెస్​ నాయకుడొకరు చెప్పారు.

ప్రవీణ్​రెడ్డి వర్సెస్​ పొన్నం

కాంగ్రెస్​నేత, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డి నియోజకవర్గంలో ‘గడప గడపకు కాంగ్రెస్, పల్లెపల్లెకు ప్రవీణన్న’ పేరుతో పాదయాత్ర చేశారు. హుస్నాబాద్, అక్కన్నపేట,  భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, చిగురుమామిడి, కోహెడ, సైదాపూర్ మండలాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. అయితే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్​ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు.​ కొద్దిరోజులు ఇద్దరూ కలిసి ‘పల్లెపల్లెకు కాంగ్రెస్, గడపగడపకు రాహుల్​గాంధీ నినాదం’ పేరుతో ప్రచారం చేపట్టారు. 

ఈ క్రమంలో  ఏఐసీసీ వర్కింగ్​ కమిటీ మెంబర్​ మోహన్​ ప్రకాశ్​ గత నెలలో హుస్నాబాద్​కు వచ్చినప్పుడు రెండు వర్గాల కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో వీరిమధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు  హుస్నాబాద్​ టికెట్​ కేటాయింపుపై అధినేతల భేటీలు, సమావేశాలు జరుగుతున్న క్రమంలో రెండు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రకరకాల చర్చలు,  అంచనాలు జోరందుకుంటున్నాయి. కరీంనగర్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు బీసీలకు అవకాశమివ్వాలని పార్టీ నిర్ణయించిందని, అందుకే తాను హుస్నాబాద్​ నుంచి పోటీ చేస్తున్నట్టు పొన్నం చెబుతున్నారు. 

ALSO READ : సంచార జాతులను మోసం చేసిన కేసీఆర్​ సర్కార్​

ప్రవీణ్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​ క్షేత్రస్థాయిలో క్యాడర్​ కలిగి ఉండి, ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు అసంతృప్తికి గురైనా గెలుపుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. వీరిద్దరిలో టికెట్​ దక్కని వారితోపాటు  సీపీఐకి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలనే ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం. పొత్తులపై సీపీఐతో తుది చర్చలు జరిగిన అనంతరం కాంగ్రెస్ స్క్రీనింగ్​ కమిటీ నిర్ణయం తర్వాత ఇక్కడ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.