- దక్షిణ కొరియాలో ప్రదానం చేసిన స్పేస్ రీసర్చ్ కమిటీ
బుసాన్ (దక్షిణ కొరియా): ఇద్దరు భారత స్పేస్ సైంటిస్టులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్, అనిల్ భరద్వాజ్ ను ఇంటర్నేషనల్ స్పేస్ సైంటిస్ట్ భేటీలో స్పేస్ రీసర్చ్ కమిటీ (కోస్పార్).. అవార్డులతో సత్కరించింది. ప్రహ్లాద్ చంద్రకు హ్యారీ మాస్సీ అవార్డు ప్రదానం చేయగా.. భరద్వాజ్ కు విక్రమ్ సారాభాయ్ మెడల్ అవార్డు అందజేశారు. దక్షిణ కొరియాలోని బుసాన్ లో సోమవారం జరిగిన 45వ కోస్పార్ వేడుకల్లో వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు.
భారత్ లో అత్యంత సీనియర్ స్పేస్ సైంటిస్టుల్లో ప్రహ్లాద్ చంద్ర ఒకరు. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ లో ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ లో ఆయన ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. స్పేస్ రీసర్చ్ లో చేసిన కృషికిగాను ఆయనకు హ్యారీ మాస్సీ అవార్డు అందజేశారు. ఎక్స్ రే ఆస్ట్రానమీలో పరిశోధనలు చేసి ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రోసాట్ ప్రోగ్రామ్ కు నాయకత్వం వహించారు. ఆస్ట్రోసాట్ ఉపగ్రహం భారతదేశ మల్టీవేవ్ లెన్త్ ఉపగ్రహం. 2015లో దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ఇంకా పనిచేస్తోంది.
ఆస్ట్రోసాట్ అందించిన డేటాపై 300 రీసర్చ్ పేపర్లలో వ్యాసాలు వెలువడ్డాయి. అలాగే చంద్రయాన్ 1 మిషన్ లోనూ ప్రహ్లాద్ చంద్ర పాల్గొన్నారు. ప్రహ్లాద్ చంద్ర గౌరవార్థం ఓ గ్రహానికి ఆయన పేరు పెట్టనున్నారు. ఇక, అనిల్ భరద్వాజ్ అహ్మదాబాద్ లోని ఫిజికల్ ల్యాబరేటరీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్పేస్ సైన్స్ రీసర్చ్ లో చేసిన కృషికిగాను ఆయనకు విక్రమ్ సారాభాయ్ అవార్డును అందించారు. ఇస్రో ఇటీవలే నిర్వహించిన చంద్రయాన్ 2, మంగళ్ యాన్, ఆదిత్య ఎల్1 మిషన్లలో భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు.