
హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా ముచ్చర్లలో మరో నగరాన్ని నిర్మించాలని సంకల్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నగర నిర్మాణం కోసం విద్య, వైద్యం, మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుందన్నారు. ముచ్చెర్ల ప్రాంతం ప్యూచర్ సిటీగా మారబోతుందని, న్యూయార్క్ నగరం కన్నా అధునాతన నగరం ఇక్కడ వస్తుందన్నారు. ఈ క్రమంలో ముచ్చర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం కొరకు భూమి కేటాయింపుకు రంగం సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్ లో మరో బెస్ట్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ కూడా సిద్ధంగా ఉందన్నారు. స్టేడియం నిర్మాణంలో బీసీసీఐ సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. అతిత్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమి పూజ చేస్తామని ప్రకటించారు. ఎంత భూమి కావాలంటే అంత ఇవ్వటానికి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నామన్నారు.
సిటీలోని స్టేడియాలను సినిమా ఫంక్షన్స్ కు,పెళ్లిళ్లు పేరంటాలకు, రాజకీయ సభలకు ఉపయోగించటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో త్వరలో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. ప్రతి మండలంలో మినీ స్టేడియాలు ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భూమి అందుబాటులో ఉంటే నిధులు కేటాయించటానికి రెడీ అని తెలిపారు.