న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ లీడర్ యహ్య సిన్వార్‌కు అరెస్టు వారంట్ జారీచేస్తామని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) తెలిపింది. సిన్వార్‌తో పాటు మరి కొంతమంది హమాస్ టాప్ లీడర్లు మొహమ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ, ఇస్మాయిల్ హనియెహ్ కూ వారంట్లు పంపుతామని ఐసీసీ పేర్కొంది. ఈమేరకు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుడు ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేయడం, దానికి ఇజ్రాయెల్ కూడా గాజాలో ప్రతిదాడులు చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో హమాస్, ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని కరీం ఖాన్ పేర్కొన్నారు. ‘‘సిన్వార్, హనియెహ్పై హత్య, పౌరులను బందీలుగా తీసుకోవడం, వారిపై రేప్‌కు పాల్పడడం, లైంగికంగా వేధించడం వంటి అభియోగాలు నమోదు చేశాం. అలాగే నెతన్యాహు, గాలంట్‌పై గాజాపై యుద్ధంచేసి అక్కడి పౌరులు ఆకలితో చనిపోయేలా చేయడం, ప్రపంచ దేశాలు పంపిన మానవతా సాయాన్ని అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగానే గాజా పౌరులను చంపడం వంటి అభియోగాలు నమోదయ్యాయి” అని కరీంఖాన్ తెలిపారు. కాగా.. అమెరికా మిత్రపక్ష దేశమైన ఇజ్రాయెల్ ప్రధానిని టార్గెట్ గా చేసుకొని అరెస్టు వారంట్ జారీ చేస్తామని ఐసీసీ పేర్కొనడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కూడా ఉక్రెయిన్ పై యుద్ధ నేరాలకు పాల్పడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూ ఇలాగే అరెస్టు వారంట్ జారీ చేసింది.