
బుక్కెడు అన్నం కోసం, నిలువ నీడ కరువై, ఆదరించేవాళ్లు లేక దుర్లభమైన చిన్నారుల జీవితాలు ఎన్నో వీధుల్లో సాక్షాత్కరిస్తున్నాయి. బతుకు భారంతో వదిలేసిన తల్లిదండ్రులు, వదిలించుకోవాలి అనే ఆలోచనలతో వదిలేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. పసిప్రాయంలోనే ఆదరణ కోల్పోయి, విద్యకు దూరంగా, భద్రతకు దూరంగా చిన్నారులు బతుకుతున్నారు. ఏది మంచి, ఏది చెడు అనేది తెలియకుండా పెరగడం వలన నేరప్రవృత్తిపైకి దృష్టి మళ్లించి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మరికొన్ని జీవితాలు చెత్తలో, చెత్తకుప్పలలో కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వీధి బాలల దయనీయ స్థితుల గురించి అవగాహన కల్పించడానికి అనేక స్వచ్చంధ సంస్థలు, మానవ హక్కుల సంస్థలు విస్తృత చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా అనేక అవకాశాలను కలిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీధి బాలలకు పునరావాసం కలించడం, వారికి సరైన ఆహారం, వైద్యం, విద్య అందించడంతోపాటు వారికి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వివిధ రంగాలలో జీవనోపాధి పొందేలా అనేక రంగాలలో నైపుణాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్లకు పైగా చిన్నారులు వీధుల్లోనే జీవనం సాగిస్తున్నారు. అయినా వీధిబాలల సమస్యను పూర్తిగా అధిగమించలేకపోతున్నాం. ఫుట్‌పాత్‌ల మీదనే గుడిసెలలో జీవించేవాళ్ళు ఉన్నారు. ఈ పిల్లలు రోడ్డున పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. నిరాదరణకు గురవ్వడం, సంఘర్షణలతో జీవితాన్ని గడపడం, కుటుంబంలో ఎవరో ఒక్కరే కుటుంబ బాధ్యతను మోయడం, కుటుంబ సభ్యులతో వేధింపులకు గురవ్వడం, వాళ్ళ ఆలోచనలను తిరస్కరించడం, అనారోగ్య సమస్యలవలన వాళ్ళను వదిలేయడం ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. సంచారజాతుల కుటుంబాలు సైతం చిన్నారుల జీవితాల పట్ల శ్రద్ధ వహించలేకపోవడంతో వాళ్ళ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. మెరుగైన సమాజం కావాలంటే ఇలా నిరాదరణకు గురైన ప్రతి ఒక్కరికి మంచి విద్యను, ఆహారాన్ని అందించే ప్రయత్నాలు ఎన్నిజరిగినా, ఇంకా అనాథ పిల్లల సంఖ్య తగ్గకపోవడంపై ప్రభుత్వం, సమాజం దృష్టి మరింత పెట్టాలి. అనాథ, వీధిబాలలకు ప్రభుత్వం నిర్భంద విద్యను, వారి పోషణను పకడ్బందీగా అమలు చేయాలి. వీధిబాలలు, అనాథ బాలలు లేని దేశంగా మన దేశాన్ని తయారు చేసేందుకు ఈ వీధి బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాలి.
- డాక్టర్. వై. సంజీవ కుమార్