దేశంలో పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ నీటి కాలుష్యం కూడా పెరుగుతూనే వస్తోంది. ప్రతిరోజూ దాదాపు నాలుగు కోట్ల లీటర్ల మురుగు జలాలు నదులు, ఇతర జలాశయాల్లోకి చేరుతున్నాయి. దేశంలోని నదుల ఎగువ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగే కొద్దీ.. దిగువ ప్రాంతాలకు ఆర్థిక నష్టం పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు మూడింట ఒక వంతు పడిపోతోంది. నదుల దిగువ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా వ్యవసాయ దిగుబడులకు 16 శాతం, వ్యవసాయ ఆదాయానికి 9 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.61 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో దేశంలో ఏటా నాలుగు లక్షల వరకు మరణాలు సంభవిస్తున్నాయి.
మనదేశంలో తాగు, సాగు నీటి అవసరాలకు మెజారిటీ ప్రజలు నదీజలాలపైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు పట్టణీకరణ, నగరీకరణ విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రజల నీటి అవసరాలు తీర్చడం కష్టంగా మారుతోంది. దేశంలో ప్రతి నగరానికీ దగ్గరగా లేదా దూరంగా ఉన్న నదుల నుంచి నీటి సరఫరా ఉంటుంది. మన అవసరాల కోసం నదుల్లోని నీటిని వాడుకుంటూ, ప్రతిగా రసాయనాలు, మురుగు, వ్యర్థ జలాలను నదుల్లోకి పంపిస్తూ వాటిని విపరీతంగా కలుషితం చేస్తున్నాం.
ప్రమాదకర స్థాయికి నదుల కాలుష్యం
మనదేశంలో చిన్నా, పెద్దా కలుపుకుని దాదాపు నాలుగు వందల నదులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి గంగా, యమున, గోమతి, అర్కావతి, ఓర్సంగ్, సబర్మతి, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, నర్మద, తీస్తా, మహానది, బ్రహ్మపుత్ర, సువర్ణలేఖ, నాగావళి. ఈ నదులన్నీ ఇప్పుడు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. కేంద్ర జలమండలి పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం.. వీటిలో దాదాపు 42 నదుల్లో ప్రమాదకరమైన క్రోమియం, రాగి, నికిల్, సీసం, ఇనుము వంటివి పరిమితికి మించి ఉన్నాయి. దీని వల్ల ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లోని సాగు భూముల్లోకి, వాటి ద్వారా తిండి గింజలు, ఇతర ఆహార పంటల్లోకి విష పదార్థాలు ప్రమాదకర స్థాయిలో చేరుతున్నాయి. కలుషితమైన నీటి ద్వారా మనం తినే తిండి కూడా కలుషితమవుతోంది. తోలు పరిశ్రమలు, గనులు, వ్యవసాయంలో మోతాదుకు మించి వాడే పురుగు మందులు, ఎరువులు, నదుల్లో పడవేసే వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారణాలవుతున్నాయి.
పరిశుభ్రతా లోపంతో వ్యాధులు
నీటిలో చేరిన రసాయనాల కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం ఒక ఎత్తయితే, నదీ తీర ప్రాంతాల్లో పరిశుభ్రతా లోపం, జంతు కళేబరాలను, పాడైన ఆహార వ్యర్థాలను యథేచ్చగా నదుల్లో పడేస్తుండటంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. అందువల్ల నదుల నుంచి సరఫరా అయ్యే తాగునీటిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల జనం రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. నీటి నుంచి వ్యాపించే బ్యాక్టీరియా వల్ల తలెత్తే డయేరియా, కలరా, అమీబియాసిస్, హైపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులతో దేశంలో ఏటా మూడున్నర కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధులు ఏటా దాదాపు 15 లక్షల మంది చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నాయి.
నీటి స్వచ్ఛత ఓబీడీ మోతాదును బట్టే..
నీటి స్వచ్ఛతను నీటిలో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ)తో లెక్కగడతారు. అయితే దేశంలోని నదుల్లో ఈ బీవోడీ మోతాదు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు సేకరించి, పరీక్షించిన శాంపుల్స్ ద్వారా వెల్లడైంది. నీటిలో ప్రతి లీటరుకు బీవోడీ 1 నుంచి 2 మిల్లీ గ్రాముల వరకు ఉంటే ఆ నీరు స్వచ్ఛమైనదిగా భావిస్తారు. బీవోడీ ప్రతి లీటరుకు 3 నుంచి 8 మిల్లీ గ్రాముల మధ్య ఉంటే నీరు ఒక మోస్తరు స్వచ్చమైంది. బీవోడీ లీటరుకు 8 నుంచి 20 మిల్లీ గ్రాముల వరకూ ఉంటే ఆ నీరు ప్రమాదానికి దగ్గరగా ఉన్నట్లు లెక్క. బీవోడీ ప్రతీ లీటరుకు 20 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నీరు పూర్తిగా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లుగా భావిస్తారు. బీవోడీ మోతాదు పెరిగే కొద్ది ఆ నీటిలో జలచరాల మనుగడ కష్టమవుతుంది. మనదేశంలోని నదుల్లో బీవోడీ పెరుగుదల కారణంగా జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని ఇకోలజిస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దేశంలో గంగా, యమున, గోమతి, గోదావరి వంటి నదుల్లో కోలిఫార్మ్ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
నేరుగా నదుల్లోకి మురుగు నీరు
దేశవ్యాప్తంగా మూడు వేలకుపైగా పట్టణాలు, నగరాల్లో కేవలం వందల సంఖ్యలో మురుగు నీటిని శుద్ధి చేసే సౌకర్యాలు ఉన్నాయి. 8 నగరాల్లో మాత్రమే మురుగు నీటిని శుద్ధి చేసే సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. సుమారు 114 నగరాలు శుద్ధి చేయని వ్యర్థ జలాలను, సగం కాలిన శవాలను నేరుగా నదిల్లోకి వదిలేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి రోజూ నాలుగు వేల కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదల అవుతోంది. ఈ నగరాల మురుగు నీటి శుద్ధి సామర్థ్యం రోజుకు 1,200 కోట్ల లీటర్లు మాత్రమే. మిగిలిన మురుగు నీరంతా ఆయా నగరాలకు సమీపంలోని నదులు, ఇతర జలాశయాలకు చేరుకుంటోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడానికి 1,500 కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రాలు దేశంలోని నదులు, సరస్సులు, జలాశయాలు, కాలువల్లో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా, మన దేశం నీటి నాణ్యత విషయంలో ఇంకా అట్టడుగు స్థానాల్లోనే కొనసాగుతోంది. కలుషిత నీటి జాబితాలో ప్రపంచంలోని 122 దేశాల్లో మనదేశం 120వ స్థానంలో ఉంది. ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో.. ప్రజల బాధ్యతారాహిత్యం కూడా అంతే ఉంది. ఈ పద్ధతి మారనంత వరకు నదుల పరిరక్షణ కాగితాలకే పరిమితమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే నదులు ఆగం కావడం ఖాయం. అదే జరిగితే మొదటగా అల్లాడిపోయేది మానవజాతే.
- మోతె రవికాంత్, వ్యవస్థాపక అధ్యక్షుడు, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్