
పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో అడవుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రజలకు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు, అడవుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతిఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నది.
2025 థీమ్: ఫారెస్ట్ అండ్ ఫుడ్. ఆహార భద్రత, పోషకాహారం, జీవనోపాధి, వాతావరణ మార్పుల కట్టడిలో అడవుల పాత్రను గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో థీమ్‌ను ఎంచుకున్నారు.
భవిష్యత్తు తరాల వారికి అడవులు ప్రాముఖ్యతను తెలియజేయాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహించాలని 1971లో ప్రకటించగా ఎఫ్ఏఓ సభ్యదేశాలు 16వ సర్వసభ్య సమావేశంలో ఆమోదించాయి.
2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొదటిసారిగా అధికారికంగా 2013లో నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఫోరం, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) సంయుక్తంగా నిర్వహించాయి.
ప్రపంచవ్యాప్తంగా అడవులు భూభాగంలో దాదాపు 31 శాతం మేరకు (మొత్తం 4.06 బిలియన్ హెక్టార్లు) విస్తరించి ఉన్నాయి. వీటిపై 80 శాతం జీవరాశులు ఆధారపడి ఉన్నాయి. అడవులు ద్వారా దాదాపు 2 బిలియన్ ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు.
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో మొత్తం 8,27,357 చదరపు కి.మీ.ల మేరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 25.17 శాతంగా ఉన్నది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం సంబంధిత మంత్రిత్వశాఖలు అడవుల సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు.
- నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ
- గ్రీన్ ఇండియా మిషన్
- ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్
- ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్
- ప్రధాన మంత్రి వన్ ధన్ యోజన్ – 2018
- ఫార్మేషన్ ఆఫ్ వన్ ధన్ వికాస్ కేంద్రాలు
అంతర్జాతీయ అటవీ విధానాలు :
యూఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్స్ 2017–30
ఇంటర్నేషనల్ ట్రోపికల్ టింబర్ అగ్రిమెంట్–1983
కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ–1992