ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం1994లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9ని అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించింది. బ్రెజిల్, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని 'ముచి-పిచి' పర్యావరణ పార్కుకు కేవలం100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. స్వచ్ఛమైన సెలయేళ్లు దట్టమైన అడవులు, గంభీరమైన కొండలు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని ప్రకృతి అందాలు, వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా అమాయక ఆదివాసీ గిరిజన జనం నివసిస్తోంది.
అడవితల్లి బిడ్డలుగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో బతుకుతున్నారు. విద్య, వైద్యం ఇంకా అందని ఆదివాసీల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. అతి పురాతన సనాతన ప్రజల (మూలవాసులు) తెగలు అంతరించిపోతున్నాయి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది.
1994 ఐక్యరాజ్యసమితి తీర్మానం..
ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం, జీవించే హక్కుతో సహా ఆధునిక మానవునికి గల అన్ని హక్కులూ ఆదివాసులకు కల్పించాలని1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 49/214 తీర్మానంలో పేర్కొన్నది.1995 నుంచి 2004 వరకు వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు, అధ్యయనాలు చేయవలసి ఉన్నది. రెండవ దశాబ్దంలో 2005 నుంచి 2015 వరకు ఆదివాసీ తెగల అస్తిత్వం, తగిన హోదా కల్పించవలసి ఉంది. పై తీర్మానంపై 148 దేశాలు సంతకాలు చేసినా, అమలుచేసిన దేశాలు కేవలం 60 మాత్రమే. ఈ 60లో భారతదేశం లేదు.
హక్కులు తప్ప, అమలు లేదు
మనదేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపడంలేదు. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 16 (4), 46, 275, 330, 332, 243డి, 5, 6 షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికారాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటివల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాల మేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం.1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్ జిల్లాల చట్టం వచ్చింది. 1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాల్లో ఉమ్మడి భూమి హక్కులొచ్చాయి. వాటినే రాజ్యాంగంలో పొందుపరిచారు.
ఆదివాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం వచ్చింది. మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారు. ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడడం లేదు. షెడ్యూల్డ్ ప్రాంతంలో జీవో 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. కానీ అలా జరగడం లేదు. గిరిజన ప్రాంతాల్లోకి టూరిజం ప్రవేశించాక గిరిజన కళలు వ్యాపార సరుకులుగా మారిపోయాయి. నిజమైన ఆదివాసీ గిరిజన దినోత్సవం అంటే వారి అవసరాలు- ఆకాంక్షలు నెరవేర్చేదిగా, అభివృద్ధి వైపు నడిపించేదిగా ఉండాలి.
- డా. ఆర్. చంద్రు, అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ