కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సప్లై.. కీలక నిందితుల అరెస్ట్

కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సప్లై.. కీలక నిందితుల అరెస్ట్

అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయ్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి మూడు కోట్లు విలువ చేసే ఎపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై కేంద్రంగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ మీదుగా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. కీలక నిందితులైన చెన్నైకు చెందిన ఖాదర్, ఇబ్రహీంలను పట్టుకోవడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్నఆరుగురు కొరియర్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు ఈ ముఠా  డ్రగ్స్ సరఫరా చేస్తోందని డీసీపీ తెలిపారు. హైదరాబాద్లోని కొరియర్ సర్వీస్ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గాజులు, ఫొటోఫ్రేమ్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి  కొరియర్ చేస్తున్నట్లు వివరించారు. ఒక గ్రాము డ్రగ్ 8వేలకు అమ్ముతున్నారని.. ఈ ముఠా ఇప్పటివరకు 30 నుంచి 50 గ్రాముల డ్రగ్స్ తరలించారన్నారు.  నిందితుల నుంచి 3 కోట్లు రూపాయలు విలువ చేసే 3.1 కేజీల సూడో డ్రగ్స్, 23 సిమ్ కార్డ్స్, 12 ఫేక్ ఆధార్ కార్డులు, 6 మొబైల్ ఫోన్స్  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొరియర్ సర్వీస్ల నిర్లక్ష్యంతోనే  డ్రగ్స్ సరఫరా జరుగుతోందని  అన్నారు.