పారిశ్రామిక విప్లవం దేశాల ఆర్థికాభివృద్ధికి ఎంతగా సహకరించిందో తెలియకుండానే పర్యావరణ కాలుష్యానికి కారణమైంది. బ్రిటన్, అమెరికా తదితర అగ్రరాజ్యాలకు మాత్రమే పారిశ్రామిక విప్లవం పరిమితమైనప్పుడు ఇది సమస్యగా పరిణమించలేదు. కానీ, చిన్న, పెద్ద అని తారతమ్యం లేకుండా ప్రపంచ దేశాలన్నీ పారిశ్రామిక విప్లవం వైపు అడుగుల వేయడంతో భూతాపం, కార్బన్ ఉద్గారాల శాతం పెరగడంతో ప్రపంచ దేశాల ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని ప్రపంచ దేశాలు భావించడంతో అంతర్జాతీయంగా పర్యావరణ సదస్సులు ప్రారంభమయ్యాయి.
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్: ఆఫ్రికా దేశాల్లో ఎడారీకరణ, కరవుకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ఏర్పాటైంది. ఈ కన్వెన్షన్‌పై 1994, అక్టోబర్ 14న ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. 1996, డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఇది సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి అనేవి ప్రధాన విధానాలుగా ఏర్పరుచుకున్నది. ఎడారీకరణ సమస్యపై చర్చించే న్యాయబద్ధమైన అంతర్జాతీయ సంస్థ ఇది ఒక్కటే కావడం ఈ కన్వెన్షన్ ప్రత్యేకత.
యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ (యూఎన్సీహెచ్ఈ) స్టాక్ హోం సదస్సు: ఐక్యరాజ్య సమితి పర్యావరణంపై ఏర్పాటు చేసిన మొదటి సదస్సు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ (యూఎన్సీహెచ్ఈ). ఇది 1972, జూన్ 5 నుంచి 16 వరకు స్టాక్‌హోంలో జరిగింది. ఈ ప్రత్యేకత కారణంగానే జూన్ 5ను అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంగా గుర్తించారు. ఈ సమావేశానికి 113 దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సులో 26 నియమాలతో కూడిన స్టాక్‌హోం డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ డిక్లరేషన్‌లో పర్యావరణ అభివృద్ధి, పర్యావరణ కాలుష్య సమస్యలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సహజ వనరుల సంరక్షణ మొదలైన అంశాల పరిరక్షణా చర్యలను వివరించారు.
యూఎన్ఈపీ: యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ (యూఎన్సీహెచ్ఈ) సాధించిన లక్ష్యాల్లో మరో ప్రధానమైన అంశం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. కెన్యా రాజధాని నైరోబిలో 1972, జూన్‌లో ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, భవిష్యత్తు తరాల వారికి సహజ వనరులను సుభిక్షంగా అందించడం దీని లక్ష్యం.
అంతర్జాతీయ పర్యావరణ చట్టాన్ని అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తుంది. 1972లో యూఎన్ఈపీ ఎర్త్వాట్ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసింది. పర్యావరణానికి సంబంధించి వచ్చే అంతర్జాతీయ సమస్యలను నియంత్రించడానికి, పర్యావరణ ముప్పు నుంచి ప్రపంచ దేశాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు.
1972 సమావేశం అనంతరం ఏర్పరచుకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించారో తెలుసుకోవడానికి 10 ఏండ్ల తర్వాత తిరిగి సమావేశం కావాలని భావించారు. 1982లో పున: సమీక్ష కోసం సమావేశమై ఏమీ సాధించలేకపోయామని గ్రహించారు. పర్యావరణ సమాచారం తెలసుకోవడానికి 1982లో ఎన్విరాన్మెంట్ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిశోధన, అభివృద్ధి, సృజనాత్మకతను పెంపొందించడానికి ఇది ఏర్పాటు చేశారు.
కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా(సీఐటీఈఎస్): ఈ ఒప్పందాన్ని 1973, మార్చి 3న అంగీకరించారు. 1975, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 181 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. సీఐటీఈఎస్ అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం. జంతువులు, మొక్కలకు సంబంధించి అంతర్జాతీయ వ్యాపారంలో ప్రాణాపాయం కలగకుండా కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం. దేశాల మధ్య వాణిజ్యంలో భాగంగా వన్యమృగాలను, మొక్కలను ఆయా దేశాల సరిహద్దులను దాటిస్తున్నారు. వీటి అక్రమ రవాణా కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఈ పరిస్థితులను నియంత్రించడానికి అంతర్జాతీయ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం.
సీఐటీఈఎస్ దేశాల మధ్య అలాంటి పరస్పర సహకార భావనను పెంపొందిస్తుంది. 1973లో వాషింగ్టన్ డి.సి.లో జరిగిన సమావేశంలో 80 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1975, జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇది దేశాలు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండే ఒప్పందం. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలను పార్టీలు అని పిలుస్తారు.
జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందం: ఈ ఒప్పందంపై ప్రపంచ దేశాలు 1992, జూన్ 5న సంతకాలు చేయడం ప్రారంభించాయి. 1993, డిసెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందంపై 168 దేశాలు సంతకాలు చేశాయి. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, అడవులను, సహజ వనరులను సుస్థిరాభివృద్ధికి వినియోగించడం ఒప్పందంలోని ప్రధానాంశాలు.
వియన్నా కన్వెన్షన్: ఓజోన్ పొరను సంరక్షించడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. వియన్నా కన్వెన్షన్‌ను 1985లో ఆమోదించారు. 1988, సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. ఈ కన్వెన్షన్‌లో ఓజోన్ పొరను సంరక్షించడానికి జరిగిన చర్చలకు అనుగుణంగా మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేశారు.
మాంట్రియల్ ప్రోటోకాల్: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా కెనడాలోని మాంట్రియల్లో సమావేశం జరిగింది. ఇక్కడి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రోటోకాల్ ముఖ్య లక్ష్యం క్లోరోఫ్లోరో కార్బన్ల నుంచి ఓజోన్ పొర దెబ్బతినకుండా చూడటం. 1987, సెప్టెంబర్ 16న ఒప్పందం అంగీకారం కుదిరింది. 1989, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. మొత్తం పార్టీలు 197.
ధరిత్రి సదస్సు లేదా రియో సదస్సు: ఈ సదస్సు పేరు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్ మెంట్ అండ్ డెవలప్ మెంట్. అనధికార పేరు ఎర్త్ సమ్మిట్. బ్రెజిల్‌లోని డియో డి జనియారో సదస్సు జరిగింది. మొత్తం 172 దేశాలు పాల్గొన్నాయి. దీని ప్రధాన థీమ్ పర్యావరణ, సుస్థిరాభివృద్ధి. ఈ సదస్సులో పర్యావరణాభివృద్ధిపై రియో డిక్లరేషన్‌ను ప్రతిపాదించారు. సుస్థిరాభివృద్ధి సాధనకు ప్రణాళిక ఎజెండా–21ను విడుదల చేశారు. అన్ని రకాల అడవుల సంరక్షణ, సుస్థిరాభివృద్ధికి ఫారెస్ట్ ప్రిన్సిపుల్స్ కలిగిన డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.