- ఆపరేషన్స్ నిలిపి వేస్తున్నం: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
- కేంద్రం బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి, వేధిస్తోందని ఆరోపణ
న్యూఢిల్లీ: మన దేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ‘‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్” మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సంస్థ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ప్రభుత్వం ఆధారాల్లేని, ఉద్దేశపూర్వక ఆరోపణలతో సంస్థను వేధిస్తోందని ఆరోపించింది. ఫారిన్ ఫండ్స్‌ను అక్రమంగా పొందారనే ఆరోపణలతో ప్రభుత్వం తమ బ్యాంక్ అకౌంట్లను సెప్టెంబర్ 10న సీజ్ చేసిందని ఆమ్నెస్టీ తెలిపింది. కేంద్రం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ను అణచివేస్తోందని, ప్రశ్నించే సంస్థలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. సంస్థ అక్రమంగా ఫారిన్ ఫండ్స్ పొందిందనే ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2018లో బెంగళూర్ లోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహించింది. ‘‘మేం ఇండియా, ఇంటర్నేషనల్ చట్టాలకు అనుగుణంగానే పని చేస్తున్నాం. మాకు ఇండియాలో దాదాపు 40 లక్షల మంది సపోర్టు చేస్తున్నారు. గత 8 ఏండ్లలో లక్ష మంది ఇండియన్స్ ఆర్థికంగా సాయం చేశారు” అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా తాము సేకరించిన ఫండ్స్ ను ప్రభుత్వం మనీలాండరింగ్ గా చిత్రీకరిస్తోందని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఇలా చేస్తోందని ఆరోపించింది.
‘‘ఆమ్నెస్టీ’’పై దర్యాప్తు చేస్తలేం: ప్రభుత్వం
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ పై ఈడీ దర్యాప్తు చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ ఎన్జీవోకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీపైనే ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టంచేశాయి. ‘‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2013–14 నుంచి 2018–19 వరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూకే నుంచి రూ.51.72 కోట్లు పొందింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను ఉల్లంఘించి ఈ ఫండ్స్ పొందినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది”అని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. దీంతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్స్ ఫర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్టు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశామన్నారు. దీనిపై అవి కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, ఈడీ ఆర్డర్‌ను కోర్టు సమర్థించిందన్నారు.
For More News..